YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నియోజకవర్గాల్లో నేతల కరువు మార్చిన వారిలో ఒక్కరే గెలుపు

నియోజకవర్గాల్లో నేతల కరువు మార్చిన వారిలో ఒక్కరే గెలుపు

విజయవాడ, జూలై 8,
వైసీపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను మార్చుతూ… సిట్టింగ్‌ల స్థానంలో కొత్త ఇన్‌చార్జులను నియమించిన వైసీపీ… ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా? ప్రజా వ్యతిరేకత ఉందని… ఎమ్మెల్యేల గ్రాఫ్‌ బాగాలేదని సిట్టింగ్‌లకు ఎసరు పెట్టి చేసిన ప్రయోగం వికటించింది. మళ్లీ అధికారం వస్తుందని… కొద్ది మంది ఎమ్మెల్యేలను మార్చితే సరిపోతుందని… అధికారాన్ని పార్టీ గుమ్మంలోనే కట్టేసుకోవచ్చన్న ప్లాన్‌ బెడిసికొట్టింది. దాదాపు 99 చోట్ల మార్పు చేసేంతవరకు వెళ్లింది. ఇక్కడి వారిని అక్కడికి అక్కడి వారిని వేరేచోటకి మార్చేసింది వైసీపీ. ఎందుకు మార్చుతున్నారో? ఏ ప్రాతిపదిక మార్పులు చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పకుండా కేవలం సర్వేలు సాకుగా చూపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు స్థాన చలనాలు కల్పించారు వైసీపీ అధినేత జగన్‌. ఇలా మారిన ఎమ్మెల్యేల్లో ఒక్క రాజంపేట నియోజకవర్గంలో తప్ప మరెవరూ ఈ ఎన్నికల్లో గెలవలేదు. అంటే మొత్తంగా వైసీపీ అధినేత చేసిన ప్రయోగం విఫలమైనట్లేనని చెప్పొచ్చు. ఐతే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఎపిసోడ్‌ ముగిసిపోయిన అధ్యాయంగా తీసిపారేసినా… తాజా పరిణామాలు క్యాడర్‌లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్య 8 విడతల్లో సుమారు 99 చోట్ల మార్పులు చేశారు. ఒక్క శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయిస్తే…. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేల బదలీలు చేశారు సీఎం జగన్‌. డిసెంబర్‌లో మాజీ మంత్రులు విడదల రజని, ఆదిమూలపు సురేశ్‌, మేరుగ నాగార్జునలతోపాటు సుమారు 11 మందితో మొదలైన మార్పుల ప్రక్రియ ఓ ప్రహసనంగా కొనసాగింది.ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో వైసీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ నియోజవకర్గానికి ఇన్‌చార్జిగా బాచిన కృష్ణచైతన్య ఇన్‌చార్జిగా ఉండేవారు. ఎన్నికలకు ముందు ఆయనను తప్పించి హనిమారెడ్డికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల తర్వాత హనిమారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని కార్యకర్తలు చెబుతుండగా, కృష్ణచైతన్య ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. ఇదేవిధంగా ఇదే జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం పరిస్థితి తయారైంది. ఈ నియోజకవర్గానికి చీరాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఇన్‌చార్జిగా తొలుత నియమించారు.ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్‌ నిరాకరించి… చీరాలకే చెందిన యడం బాలాజీని అభ్యర్థిగా పోటీపెట్టారు. ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న బాలాజీ ఎన్నికల తర్వాత మాయం అయ్యారు. మళ్లీ ఆయన ఎప్పుడు నియోజకవర్గానికి వస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని గుంటూరు వెస్ట్‌కు మార్చారు. ఈ స్థానం నుంచి గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడిని పోటీకి పెట్టారు. ఈ ఇద్దరూ ఇప్పుడు చిలకలూరిపేటను వదిలేశారు. ఇదేవిధంగా చిత్తూరు జిల్లాలోనూ కొన్ని నియోజకవర్గాలు నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నాయి.ఇక విశాఖ జిల్లాలో అనకాపల్లి నుంచి పోటీ చేసిన మలసాల భరత్‌కుమార్‌… ఎన్నికల ముందు వరకు విదేశాల్లో వ్యాపారం చేసేవారు. ఓటమి తర్వాత ఆయన ముఖమే కనిపించడం లేదని అక్కడి కార్యకర్తలు చెబుతున్నారు. ఇక పాయకరావుపేటలో హోంమంత్రి అనిత చేతిలో ఓడిపోయిన కంబాల జోగులు ఆచూకీ కూడా తెలియడం లేదంటున్నారు స్థానిక కార్యకర్తలు. జోగులు విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. మూడోసారి మళ్లీ అదేస్థానం నుంచి పోటీచేయడానికి చాన్స్‌ ఇవ్వలేదు వైసీపీ అధినాయకత్వం. ఆయనకు గ్రూప్‌-1 ఆఫీసర్‌ను బదలీ చేసినట్లు ఏకంగా 200 కిలోమీటర్ల దూరం ఉన్న పాయకరావుపేటకు పంపారు. ఎన్నికలకు నెల రోజుల ముందు పాయకరావుపేట వచ్చిన జోగులు.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ అటువైపు కనిపించలేదట… ఇలానే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాజీ మంత్రులు ఆదిమూలం సురేశ్‌, మేరుగ నాగార్జునను స్థానాలు మార్చారు.వీరితోపాటు కొండెపి నియోజకవర్గానికి చెందిన అశోక్‌బాబును గుంటూరు జిల్లా వేమూరు తీసుకువచ్చారు. వీరు మళ్లీ పాత స్థానాలకు వెళ్లాలా? లేక కొత్త బాధ్యతల్లోనే కంటిన్యూ అవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇదేవిధంగా విశాఖ నార్త్‌లో పోటీచేసిన కేకే రాజు తన కార్యాలయాన్ని ఎత్తేసి… పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రి చెల్లబోయిన వేణుది విచిత్ర పరిస్థితి. ఈయన స్వస్థలం అమలాపురం కాగా, కాకినాడ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, 2019 ఎన్నికలల్లో రామచంద్రాపురం టికెట్‌ ఇచ్చి గెలిపించింది వైసీపీ.దీంతో అక్కడే సొంత ఇల్లు కట్టుకున్నారు వేణు. ఐతే ఐదేళ్లు తిరిగేసరికి మళ్లీ ఆయనను రాజమండ్రి రూరల్‌ పంపారు. ఈ స్థానంలో ఓటమితో ఆయన ఏ నియోజకవర్గం చూసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇలా వైసీపీ చేసిన మార్పులతో ఏర్పడిన గందరగోళం ఇప్పటికీ కొనసాగుతోంది. ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో మాజీ సీఎం జగన్‌ సమీక్షించారు. ఆ సందర్భంలో కూడా ఈ సమస్యను కనీసం చర్చించలేదు. వచ్చిన వారికి ధైర్యం చెప్పి పంపారే కానీ, ఇన్‌చార్జులు కనిపించని నియోజకవర్గాలపై కనీసం చర్చించలేదు. పరిస్థితులు ఇలానే కొనసాగితే… సుమారు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Posts