విజయవాడ, జూలై 8,
రాజధాని అమరావతి చట్టం అత్యంత పకడ్బందీగా తయారు చేయాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు… తన మానస పుత్రిక రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ తీరుతో దెబ్బతిన్న రాజధాని అమరావతికి భవిష్యత్‌లోనూ ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పక్కగా స్కెచ్ వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే సీఆర్‌డీఏ చట్టంతో రాజధాని ప్రణాళికలను సమర్థంగా తయారుచేసిన ప్రభుత్వం…. రాజధాని తరలింపు అనే ఆలోచన భవిష్యత్‌లో కూడా ఎవరికీ రాకుండా ఉండేలా… రాష్ట్రానికి అమరావతి ఒక్కటే ఏకైక రాజధానిగా ఉండేలా చట్టం తేవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అమరావతి పరిరక్షణ చట్టం చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు… ఢిల్లీ టూర్‌లో ఉన్న చంద్రబాబు…. ప్రధాని మోదీతో ఇప్పటికే తన ఆలోచనలు పంచుకున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి… దశ, దిశ మారాలంటే అమరావతి చట్టం చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు చంద్రబాబు. దేశంలో అమరావతి లాంటి రాజధానిని కదపాలని గత ప్రభుత్వంలో మాత్రమే తొలిసారిగా జరిగిందని వివరించిన బాబు… భవిష్యత్తులో ఎవరైనా రాజధానిని కదపడానికి వీలు లేకుండా దేశంలోనే రాజధానుల కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలతో రాజధాని కోసం పకడ్బందీ స్కెచ్ రెడీ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. కేవలం ఏపీకి మాత్రమే కాదు దేశంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరగకూడదని.. అమరావతి రాజధాని వివాదం ఒక గుణపాఠంగా మారిందని భావిస్తున్నారు చంద్రబాబు. అమరావతి రాజధాని శాశ్వతంగా అక్కడే ఉండేలా ప్రత్యేక చట్టం చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమనే నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. అమరావతిని ఎన్ని తరాలు గడచినా ఎక్కడికీ తరలించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటేనే పెట్టుబడిదారులు వస్తారని, రాష్ట్రం బాగుపడుతుందని భావిస్తున్నారు సీఎం.ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ అమరావతిని గాలికొదిలేయడం వల్ల…. 2019కి ముందు అమరావతిలో స్థాపించాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో అమరావతితోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనుకబడిందనే అభిప్రాయం ఉంది. అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందేది. ఐదేళ్ల పాటు రాజధాని పనులు పెండింగ్‌లో పడిపోవడంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా అమరావతిని విడిచి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది.ఇక ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే భరోసాతో ఆయా సంస్థలు మళ్లీ వద్దాం అనుకున్నా… భవిష్యత్‌లో అమరావతిపై ఎలాంటి వివాదం తలెత్తకుండా… అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని వారికి అభయం ఇచ్చేలా చట్టం చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు వైసీపీ నేతలు ఇప్పటికీ అమరావతిని వ్యతిరేకిస్తుండటం వల్ల ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందనే కారణంతోనే ప్రజలు తమను తిరస్కరించారన్న విషయాన్ని గ్రహించని వైసీపీ నేతలు ఇప్పటికీ మూడు రాజధానులకు అనుకూలంగా ప్రకటనలు చేయడం రాజధాని వాసులతోపాటు, చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది. వైసీపీ సీనియర్ నేత బొత్స, మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వంటివారు అమరావతి వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ స్టాండ్ మారనందున రాజధాని చట్టంతోనే అమరావతికి రక్షణ కల్పించాలనే గట్టి నిర్ణయం తీసుకునేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు