ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మైలవరం నియోజకవర్గానికి సాగు నీరు అందించడంతో పాటు, నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లిచ్చామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం నాడు జి.కొండూరు, మైలవరం లో జరిగిన 3వ రోజు నవ నిర్మాణ దీక్షలో ఆయన ఉత్సహంగా పాల్గొని ప్రసంగించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే మైలవరం నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని మంత్రి ఉమా ఉద్గాటించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును కష్టనష్టాలు ఎన్నోచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 300 అడుగుల లోతులో భూమిని తొలిచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటివరకు 54% పోలవరం పనులు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తన శాఖ ద్వారా ఇప్పటివరకు 54వేల కోట్ల రూపాయలు ఖర్చు పెటించారని ప్రజల హర్ష ధ్వానాల మధ్య తెలియజేసారు. జి.కొండూరులో 12 ఎస్టీ మత్స్యకారులకు 12 లక్షల విలువైన (బోట్లు, వలలు, సైకిల్, పరదపట్టా) రుణాలు, మైలవరం లో 120 మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం రూ. 20 లక్షలతో మైలవరం లో గోకులం పశువుల వసతి గృహానికి శంకుస్థాపన చేసి, దీపికా మండల మహిళా సమాఖ్య 70 గ్రూపులకు చెందిన బ్యాంక్ లింకేజి 2 కోట్ల 57 లక్షల చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి పథకాల స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, కలెక్టర్ లక్ష్మీ కాంతం పాల్గొని ప్రసంగించారు.