కాకినాడ, జూలై 11,
సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసే పవన్ కల్యాణ్.. పాలనా వ్యవహారాల్లోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఆయన.. నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేయిస్తున్నారు. అయితే.. పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేయిస్తూ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలోని సమస్యలు, మౌలిక వసతులపై సర్వే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈక్రమంలో.. పిఠాపురంలో అనేక సమస్యలు గుర్తించి మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక.. పిఠాపురం నియోజవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు.. పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై.. పిఠాపురం సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పిఠాపురంపై వరుసగా సమీక్షలు చేస్తూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తంగా చేస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో కలెక్టర్ చేపట్టే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లాంటి కార్యక్రమాన్ని కూడా నెలలో రెండు వారాలు పిఠాపురంలోనే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. ప్లాస్టిక్ భూతంపై యుద్ధాన్ని ప్రకటించారు పవన్ కల్యాణ్. తాజాగా.. కాలుష్య నియంత్రణపై రివ్యూ చేసిన పవన్.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి సమయంలోనే పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై ప్రత్యేక అధికారుల బృందంతో పవన్‌కళ్యాణ్ సర్వే చేయిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.