YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టార్గెట్ 14 ఎందుకు మిస్సైంది

టార్గెట్ 14 ఎందుకు మిస్సైంది

హైదరాబాద్, జూలై 12 
లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది.. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు AICC నియమించిన జేపీ కురియన్‌ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌ చేరుకుంది. కమిటీ సభ్యులకు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ స్వాగతం పలికారు. కురియన్‌తో పాటు రకీబుల్‌ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు గాంధీభవన్‌లో పార్టీ సీనియర్‌ నేతలతో వరుసగా భేటీ అవుతారు. రియన్ కమిటీ ముందు తమ ఓటమికి కారణాలు చెప్పుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయామని ఎక్కువ మంది చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో అన్ని చోట్లా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. లోక్ సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరిలో పరాజయం ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీ వచ్చినా ఇతర చోట్ల బీజేపీ అభ్యర్థికి ఓట్లు పడటంతో వంశీచందర్ రెడ్డి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అలాగే సికింద్రాబాద్ , నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మెదక్  వంటి చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేకపోయారన్న దిశగా కురియన్ కమిటీ పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు తమకు ఎలా సహకరించలేదో చెబుతూ.. వారికి పట్టు ఉన్న  పోలింగ్‌ బూత్‌లలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు..  పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను కురియన్ కమిటీ ముందు పెడుతున్నట్లుగా చెబుతున్నారు. గాంధీ  భవన్‌లో కురియన్ కమిటీతో  భేటీ అయ్యేందుకు కొంత మంది గెలిచిన అభ్యర్థులతో పాటు మరికొంత మంది టిక్కెట్ ఆశించి భంగపడినవారు కూడా వచ్చారు.
క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి నివేదికను హైకమాండ్ ను కురియన్ కమిటీ సమర్పించనుంది. అయితే ఇది.. ఎవరిపైనా ఫిర్యాదులు చేయడానికి లేదా ఫలనా వాళ్ల తప్పు ఉందని చెప్పడానికి కాదని.. కేవలం పార్టీ వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగిదే దిద్దుకోవడానికి హైకమాండ్ చేస్తున్న ప్రయత్నమేనంటున్నారు. ఇలాంటి కమిటీలు ఒక్క తెలంగాణ కే వేయలేదని.. మరో ఐదారు రాష్ట్రాలకుూ వేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ గెలుస్తుందనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఓటమికి కారణాలపై వారిని కమిటీ సభ్యులు ఆరా తీస్తారు. రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటారు. మూడో రోజు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు కమిటీ సభ్యులు వెళతారా..? లేదా..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా చేవెళ్ల, మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్‌ వంటి స్థానాల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులేమిటనే కోణంలో అధిష్ఠానం ఆరా తీస్తోంది.ఈ లోక్‌సభ స్థానాల పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గినా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై కమిటీ విశ్లేషణ జరుపుతుందని సమాచారం. ఆయా స్థానాల నేతలు తగు సమాచారంతో హాజరుకావాలని ఇప్పటికే వారికి పార్టీ సూచించింది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక నేతలు సరిగా పనిచేయలేదనే ఆరోపణలు సైతం ఉండటంతో వారి గురించి వివరాలు సేకరించనుంది. నేతల పనితీరు, పోల్‌ మేనేజ్‌మెంట్‌కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో కమిటీ సమాచారం అడగనుందని తెలుస్తోంది.

Related Posts