పేదలు పండుగలను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్‌కు సరకులు ఉచితంగా సరఫరా చేస్తోంది. జిల్లాలో 1,83,700 మంది కార్డుదారులకు రంజాన్ తోఫా పంపిణీకి యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక్కొక్కరికి 5 కిలోల గోధుమపిండి, 2 కిలోల పంచదార, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యి అందించనుంది. ముస్లిం మతపెద్దలతో జిల్లా అధికారులు సమావేశమై వాటి పంపిణీపై చర్చించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ పండుగ సమయానికి వాటిని అందిస్తోంది. ప్రభుత్వం సదాశయంతో చేస్తున్న కార్యక్రమంలోనూ సరఫరా కాంట్రాక్టర్లు అక్రమాలకు తెర తీస్తున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక సందర్భంగా కార్డుదారులకు పంపిణీ చేసిన సరకుల్లో నాసిరకమైన బెల్లం సరఫరా చేశారు. అప్పట్లో దాని సరఫరా టెండరు దక్కించుకున్న గుత్తేదారు బాక్సుల్లో బెల్లం పెట్టి అట్ట పెట్టెల ద్వారా పౌరసరఫరాల శాఖ గోదాములకు రవాణా చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల అధికారులు డీలర్లకు పంపిణీ బాక్సుల్లోని బెల్లం పాకంలా తయారైంది. కార్డుదారులకు పంపిణీ చేసే సమయానికి బాక్సుల నుంచి పాకం కారడంతో కార్డుదారులు తీసుకోవడానికి నిరాకరించారు. క్రిస్మస్ కానుక పంపిణీ సమయంలో గుర్తించడంతో సంక్రాంతి కానుక పంపిణీ సమయానికి నాసిరకం బెల్లం స్థానంలో నాణ్యమైన బెల్లం సరఫరా చేశారుపేదలే కదా ఎలాంటివి సరఫరా చేసినా అడిగేవారు ఉండరన్న ధీమా... ఉచితంగా ఇస్తున్నందున నాణ్యత పెద్దగా పట్టించుకోరన్న భరోసాతో నాణ్యత లేని సరుకులు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా ఏదో ఒక సరుకు నాణ్యత లేక లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిని నివారించడానికి జిల్లా యంత్రాంగం ముందస్తు చొరవతో తీసుకున్న నిర్ణయంవల్ల నాణ్యత లేని నెయ్యిని గుర్తించి తిప్పి కాంట్రాక్టరుకు పంపారు. రెండు రోజుల్లో నాణ్యమైన నెయ్యి సరఫరాకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఈ నెల 11 నుంచి రంజాన్ తోఫా పంపిణీ చేయనున్నారు. జిల్లాకు వచ్చిన సరకుల నాణ్యతను పరీక్షించాలని సంయుక్త పాలనాధికారి ఎ.ఎండీ.ఇంతియాజ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వేర్వేరు ప్రాంతాల్లో 15 నుంచి 20 కుటుంబాలకు రంజాన్ తోఫా సరకులు అందించి వండి రుచి చూడాలని కోరారు. పదార్థాలు వండిన మహిళలు నెయ్యిలో నాణ్యత లేదని, సువాసన రావడం లేదని గుర్తించారు. అధికారులు అన్ని ప్రాంతాల్లో ఇచ్చిన వారి నుంచి అభిప్రాయాలు సేకరించగా అందరూ నెయ్యి బాగాలేదని బదులిచ్చారు. దీంతో ఆదివారం సాయంత్రమే నెయ్యి నాణ్యతలేదని గుర్తించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాకు సరఫరా చేసిన నెయ్యి ప్యాకెట్లను వాహనం నుంచి అన్‌లోడ్ చేయకుండా తిప్పి పంపారు. నాణ్యతలేని నెయ్యి స్థానంలో రుచికరమైనది రెండు రోజుల్లో జిల్లాకు చేరేలా ఆదేశాలు ఇచ్చారు. దీంతో గతంలో వలె పండుగకు పంపిణీ చేసే సమయంలో నాణ్యత లేని సరకులను గుర్తించినా అప్పటికప్పుడు లక్షల సంఖ్యలో ప్యాకెట్లు తయారుచేసి సరఫరా చేయడం సాధ్యం కాక వాటినే పంపిణీ చేసేవారు. ఇందుకు భిన్నంగా ఈసారి పంపిణీ ప్రారంభించక ముందే సంయుక్తపాలనాధికారి చొరవ చూపి మతపెద్దల సమక్షంలో బరువు, నాణ్యత పరిశీలించడంతో లోపాలు బహిర్గతమయ్యాయి.