న్యూఢిల్లీ, జూలై 12
కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విస్తృత స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులున్న ధర్మాసనానికి కేసును బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే 90రోజులుగా సీఎం కేజ్రీవాల్ జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. మార్చి 21న లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. దానిపై విచారణ జరిపారు. అదే క్రమంలో ఆయన బెయిల్ కోసం అనేక సార్లు కోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రచారం నిమిత్తం 21 రోజుల పాటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే ఆ బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. దీనిపై స్పెషల్ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. దీంతో కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు స్పెషల్ కోర్టులో పలుసార్లు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక మధ్యంతర బెయిల్ ముగియడంతో పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు జూన్ 2న తిరిగి తిహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు.ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాములో సీబీఐ కూడా సీఎం కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. ఈ తరుణంలో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పెషల్ కోర్టు సానుకూలంగా స్పందించి బెయిల్ ఇస్తే, ఢిల్లీ హైకోర్టు దానిని కొట్టేసింది. దీంతో సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు స్పెషల్ కోర్టు ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేయడాన్ని సవాలు చేస్తూ మరో బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు జూలై 12న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈడీ, సీబీఐ తరఫు వాదనలను ఏకీభవించని సుప్రీం కోర్టు.. కేజ్రీవాల్ ప్రజాప్రతినిధి అని పేర్కొంది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. దీంతో పాటూ ఈ కేసును విస్తృత స్థాయి విచారణ నిమిత్తం ఐదుగురు సభ్యలు ఉన్న బెంచ్‌కు బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 90 రోజులపాటు తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో స్వల్ప ఊరట లభించినట్లయింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈడీ కేసుల్లో దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రమే జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు.. సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టు ఎలాంటి బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో రిమాండులోనే కొనసాగనున్నారు సీఎం కేజ్రీవాల్. ఒక వేళ బయటకు రావాలంటే.. సీబీఐ కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దానిని స్వీకరించి విచారణ జరిపిన తరువాత ఇచ్చే కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుంది. అంతవరకూ కేజ్రీవాల్ బయటకు వచ్చేందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు బెయిల్ మంజూరైంది కేవలం ఈడీ కేసుల్లోనే అన్నది గమనించాల్సి విషయం. మరి రానున్న రోజుల్లో సీఎం కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.