ఒంగోలు, జూలై 16,
మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడుతారా? ఈ విషయాన్ని హై కమాండ్ కు తేల్చి చెప్పారా? అందుకే జగన్ సమీక్షల్లో బాలినేని కనిపించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికలకు ముందు నుంచే పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు బాలినేని. ఈ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ బాలినేనిని హై కమాండ్ పెద్దగా నమ్మడం లేదు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై బాలినేని తో పాటు వైసిపి స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు సమీప బంధువు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి స్వయానా బావ అవుతారు బాలినేని. గత ఎన్నికలకు ముందు వైవి సుబ్బారెడ్డి తో బాలినేనికి విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో అప్పటి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో బాలినేని ఐక్యతగా ఉండేవారు. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాగుంట, అసెంబ్లీ స్థానం నుంచి బాలినేని పోటీ చేయాలని భావించారు. కానీ బాలినేని విన్నపాన్ని జగన్ అంగీకరించలేదు. దీంతో బాలినేని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. బాలినేనిని బుజ్జగించారు జగన్. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ లేదని చెప్పడంతో ఆయన టిడిపిలో చేరిపోయారు. అయితే అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు జగన్. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకించారు. వైసిపి నాయకత్వం ఒత్తిడి మేరకు వెనక్కి తగ్గారు బాలినేని. ఇప్పుడు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో బాలినేని పునరాలోచనలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో చెవిరెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించడంతో.. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.2014 ఎన్నికల్లో సైతం బాలినేని ఓడిపోయారు. అప్పుడే నియోజకవర్గానికి కొద్ది రోజులు పాటు దూరంగా ఉండిపోయారు. ఈ న్నికల్లో అంతకుమించి పరాజయం ఎదురు కావడంతో నియోజకవర్గానికి దూరం అవుతారని ప్రచారం జరుగుతోంది. జూన్ 4న ఫలితాలు వస్తే.. దాదాపు 40 రోజుల తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పుడు ఒంగోలు నగర రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కూడా లేకుండా పోతోంది. నగర మేయర్ తో పాటు మెజారిటీ కార్పోరేటర్లు టిడిపి గూటికి వెళ్లేందుకు సిద్ధపడినట్లు సమాచారం. చాలామంది కార్పొరేటర్లు టిడిపి ఎమ్మెల్యే జనార్ధనకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మేయర్ బాలినేనికి చెప్పగా పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.బాలినేని ప్రకాశం జిల్లా బాధ్యతలు తనకు మాత్రమే అప్పగించాలని చాలా సందర్భాల్లో వైసీపీ హై కమాండ్ కు తేల్చి చెప్పారు. కానీ పార్టీ హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చింది వైసిపి. ఆ సమయంలో సైతం కనీసం సంప్రదించలేదు. బాలినేనిలో అసంతృప్తికి అదే ప్రధాన కారణం. ఆయన సూచించిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ లేదని తేల్చి చెప్పారు జగన్. బాలినేని చెప్పినా వినలేదు. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెప్పించి నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. ఎంపీగా నిలబెట్టారు. ఇప్పుడు జిల్లా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. సహజంగానే ఇది బాలినేనికి మింగుడు పడని విషయం. అయితే బాలినేని వేరే పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు సమాచారం. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమీక్షలకు సైతం బాలినేని హాజరు కావడం లేదు. ఆయన కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరుతారని తెలుస్తోంది. కానీ ఇంత చేరికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అందుకే వైసిపి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని బాలినేని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి చేరిపోవడం ఖాయంగా తేలుతోంది.బాలినేని పట్టించుకోకపోవడంతో వైసీపీ శ్రేణులు సైతం నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. చివరకు వైయస్సార్ జయంతి వేడుకలకు కూడా మెజారిటీ నాయకులు హాజరు కాలేదు. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ సుజాతతో పాటు మెజారిటీ కార్పొరేటర్లు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గతంలో వీరంతా సమావేశం అయ్యారు. బాలినేనిని సంప్రదించారు. కానీ ఆయన రాజకీయాలంటేనే విరక్తి అన్న రీతిలో మాట్లాడారు. అందుకే వారంతా ఎమ్మెల్యే జనార్దన్ టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వీరు టిడిపిలోకి చేర్చుకోవడం ఖాయం. అయితే బాలినేని వ్యవహారం ఎవరికీ అంతుపట్టడం లేదు. వీలైనంతవరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి.. ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది