YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కలెక్టర్లే... కళ్లు, చెవులు

కలెక్టర్లే... కళ్లు, చెవులు

హైదరాబాద్, జూలై 16
తెలంగాణలో ఉన్న కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారున్నారని, వారంతా ఇక్కడి సంస్కృతిలో భాగస్వామ్యమవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. కలెక్టర్లు ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటి వారన్నారు. గతేడాది డిసెంబర్ 24న తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించి నిజమైన లబ్ధిదారుల్ని గుర్తించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కలెక్టర్లు తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు. తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని చెప్పారు. ఒక శంకరన్, శ్రీధరన్ లా.. సామాన్య ప్రజలు కలెక్టర్లను గుర్తుంచుకునేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పాలనపై ప్రజల ఆలోచనలేంటో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలన్నారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే.. ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు. కలెక్టర్లు తీసుకునే ప్రతీచర్య ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.ఈ ప్రభుత్వంలో పారదర్శకమైన ప్రజాహిత పాలనను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి విద్యావ్యవస్థ అత్యంత కీలకమన్న సీఎం.. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆదేశించారు. ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.85 వేలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని తెలిపారు.కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు బదిలీలపై వెళ్తుంటే.. విద్యార్థులు కంటతడి పెట్టుకున్న ఘటనలున్నాయని, కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి ప్రజావాణికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమని ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
ప్రజల్లోకి మీరు తీసుకువెళ్లాలి
. ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదనీ.. రైతు భరోసా అభిప్రాయ సేకరణ కోసం జిల్లాలకు వెళ్లినప్పుడు ఈ విషయం అర్థమైందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు. ఇక సమావేశ ఎజెండాలో తొమ్మిది అంశాలను చేర్చారు. ప్రధానంగా డ్రగ్ వ్యతిరేక ప్రచారం, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం, లా & ఆర్డర్ సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, మహిళా శక్తి, విద్య, ధరణి , ప్రజా పాలన , వన మహోత్సవంపై చర్చించనున్నారు.

Related Posts