YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ కాంగ్రెస్ లో నిస్తేజం... చతికిల పడ్డ రేవంత్, రాములమ్మ, నాగం...

టీ కాంగ్రెస్ లో నిస్తేజం... చతికిల పడ్డ రేవంత్, రాములమ్మ, నాగం...

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక రక మైన సందిగ్ధం నెలకొంది. శాసన సభ చరిత్రలోనే తొలిసారిగా పెద్దగా బలమైన కారణం లేకుండానే ఇద్దరు శాసన సభ్యుల సభ్యత్వాలను రద్దు చేశారు. మోపిన అభియోగాలకు ఎక్కడా సరైన సాక్ష్యాలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టలేదు. న్యాయస్థానంలోనూ వీరి బహిష్కరణకు దారితీసిన సంఘటనకు సంబంధించిన ఎలాంటి వివరాలను అందించలేకపోయింది. శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు శాసన సభలో గవర్నర్ ప్రసంగ సమయంలో మైకు విసరడంతో శాసన మండలి ఛైర్మన్  స్వామిగౌడ్ గాయపడ్డారని ప్రభుత్వం చేసిన ఆరోపణలను  న్యాయస్థానం విశ్వసించలేదు.  దీంతో వీరి బహిష్కరణ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై  12 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కోర్టులో కేసు వేయించారు. దీన్ని కూడా కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు ఎమ్మెల్యేలకు సంబంధంలేదని, పిటిషన్ వేయాల్సింది స్పీకర్ లేదా శాసన సభ కార్యదర్శి మాత్రమేనని కోర్టు సైతం స్పష్టం చేసింది.  ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ వ్యూహకర్తలు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు పెరుగుతున్నాయి. బహిష్కరణకు గురైన శాసన సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. తమ విషయంలో పార్టీ, శాసన సభ పక్షం రెండూ సరిగా స్పందించడంలేదన్న కోపంతోనే కోమటిరెడ్డి సీఎల్పీ నేత జానా రెడ్డిని గట్టిగా నిలదీశారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే.. కాంగ్రెస్ శాసన సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని కోమటి రెడ్డి కోరుతున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి డిమాండ్ కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. ఇద్దరు సభ్యులను బహిష్కరించినా కాంగ్రెస్ పెద్దల్లో పెద్దగా కదిలిక లేకపోవడానికి కారణాలు మాత్రం ఎవరికి అంతుబట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకులంతా సమిష్టిగా, ఒక్కతాటిపైకి వచ్చి పనిచేస్తున్నారన్న బలమైన సంకేతాలను పీసీసీ పంపించలేకపోతోంది. బస్సు యాత్రలో కొంత కదలిక వచ్చినా.. అది బలమైన అధికార పార్టీని ఢీకొట్టేందుకు సరిపోదని నాయకులే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ తెచ్చామన్న సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా నేడు వెలుగొందుతున్నారు. ప్రభుత్వం రకరకాల పథకాల పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అధికారంలో ఉన్న సానుకూల అంశాన్ని  ఉపయోగించుకుని మిగిలిన అన్ని పార్టీలకంటే ప్రస్తుతానికి పై చేయిగానే కనిపిస్తోందని, ఈ స్థితితో కాంగ్రెస్ తనకు అంది వచ్చిన ఏ  ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ద్వితయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలపై  వేగంగా స్పందించడంలో పీసీసీ విఫలమవుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ బలమైన రైతు వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయల పంటపెట్టుబడి సాయం పేరుతో రైతుబందు పథకం ప్రవేశపెట్టారు. దీంతో పాటు ఇప్పుడు రైతు బీమా పథకం తీసుకు వస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్యపరీక్షలు, కంటి పరీక్షలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకే, ఈ పథకాలు ఓట్లు కురిపిస్తాయని అధికార పార్టీ బలంగా నమ్ముతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల కంటే అధికార పార్టీ జెట్ స్పీడ్‌తో ప్రజల్లోకి దూసుకుపోతోంది. ఈ వేగాన్ని అందుకునేందుకు పీసీసీ మాత్రం పెద్దగా శ్రమించడంలేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రచారానికి ధీటుగా ప్రత్యామ్నాయలను ప్రజల్లోకి పీసీసీ నాయకత్వం తీసుకుపోలేకపోతోంది. రుణ మాఫీ, వడ్డీ చెల్లింపు, పంటలకు గిట్టుబాటు ధర, దళితులు, గిరిజనులపై దాడులు, మైనార్టీ, గిరిజన రిజర్వేషన్లు ఇలా అనేక సమస్యల విషయంలో ప్రకటలకే ఎక్కవ శాతం పరిమితమైయ్యారన్న విమర్శలు పెరుగుతున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై కోమటి రెడ్డి చేసిన రాజీనామా ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీలో క్రమంగా మద్దతు పెరుగుతోంది. మరో వైపు పీసీసీలో పదవుల పంపకంపై కూడా కాక పెరుగుతోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి తన దూకుడును పూర్తిగా తగ్గించేశారు.  మరో ఫైర్ బ్రాండ్ నాగం జనార్ధన్ రెడ్డి , రాములమ్మ విజయశాంతి సైతం పదవులు కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి పార్టీలో ఏదో ఒక కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా వారి శక్తిసామర్ధ్యాలను పార్టీ సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని చాలా మంది నాయకులు గట్టిగానే పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ ప్రస్తుత వేగం ఏ మాత్రం సరిపోతదని, తక్షణమే  గేరు మార్చి జెట్ స్పీడ్ అందుకునేలా చేయకుంటే... తీరిగ్గా చింతించాల్సి వస్తుందని ఈ నాయకులు హెచ్చరిస్తున్నారు.

Related Posts