విశాఖపట్టణం, జూలై 17
విశాఖ ఫైల్స్ తయారవుతోంది. కశ్మీర్ ఫైల్స్ సినీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తే… విశాఖ ఫైల్స్ విడుదలకు ముందే పొలిటికల్ సర్కిల్స్‌ను కుదిపేస్తోంది. రాజకీయ రంగం స్థలంపై ఆవిష్కరణకు సిద్ధమవుతున్న విశాఖ ఫైల్స్ సినిమా అనుకుంటే మీరు పొరబడినట్లే…. విశాఖ కేంద్రంగా గత ఐదేళ్లుగా చోటుచేసుకున్న భూ దందాలపై టీడీపీ ఎక్కు పెట్టిన అస్త్రమే విశాఖ ఫైల్స్. సినిమాల్లో హీరోలు ఉంటారు.. విలన్స్ ఉంటారు… కానీ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న విశాఖ ఫైల్స్‌లో విలన్ క్యారెక్టర్లే ఎక్కువగా ఉంటారని చెబుతోంది అధికార టీడీపీ… గత ఐదేళ్లలో విశాఖ కేంద్రంగా చోటు చేసుకున్న భూ ఆక్రమణలు, ఇతర దందాలను బయటపెట్టేందుకు విశాఖ ఫైల్స్ తయారు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పొలిటికల్ ఫైల్స్‌లో ఏం ఉంటుంది? ఎవరిని టార్గెట్ చేస్తుందనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఎన్నో పోరాటాలు చేసింది టీడీపీ.. జనసేనాని పవన్ కూడా అప్పట్లో విశాఖలో భూదందాలపై పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఐతే ప్రతిపక్షంగా టీడీపీ, జనసేన ఎంత గొంతు చించుకున్నా… గత ప్రభుత్వం చలించలేదు. విశాఖ భూ దందాల్లో వైసీపీ ముఖ్య నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు రావడంతో గత పాలకులు అస్సలు పట్టించుకోలేదని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేతులు మారడంతో విశాఖ భూములపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం.. ఈ మూడు పార్టీలూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో విశాఖ భూముల దందాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అక్రమాలకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకునేలా… విశాఖ ఫైల్స్ సిద్ధం చేస్తోంది.గత వారం విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖ ఫైల్స్‌ను రూపొందించాలని మాజీ మంత్రి గంటాను ఆదేశించారు. సీఎం సూచనలతో రంగంలోకి దిగిన గంటా… త్వరలో విశాఖ ఫైల్స్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గత నెలలో రుషికొండ రహస్యాలను ఛేదించిన గంటాకు ప్రత్యేకంగా ఈ పని అప్పగించడమే రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. గత ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను సామాన్యులు ఎవరూ చూడలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెక్యూరిటీని ఛేదించుకుని వెళ్లిన గంటా… రుషికొండ రహస్య భవనాలను మీడియాకు చూపించడం ద్వారా… వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు భూ దందా బాగోతం బయటపెట్టే పనిని గంటాకే అప్పగించారు చంద్రబాబు..ఇక అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన గంటా… విశాఖలో అక్రమ భూ భాగోతాలను బటయకు తీస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేతలతోపాటు… మాజీ ప్రజాప్రతినిధులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములతోపాటు విశాఖ నగరంలోని ఖరీదైన ప్రాంతంలోని దసపల్లా, ఎన్‌సీసీ, హయగ్రీవ ప్రాజెక్టు భూములు…. వైసీపీ నేతల పరమైన వైనాన్ని బయటపెట్టనున్నట్లు టీడీపీ చెబుతోంది. ఈ భూ దందాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందినా, గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉండటంతో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందోనని టెన్షన్ కనిపిస్తోంది.వైసీపీ బడా లీడర్లపైనే ఎక్కువగా ఆరోపణలు ఉండటంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని ఆ పార్టీ క్యాడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు భూములు, గనుల వ్యవహారాలపై శ్వేతప్రతం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. విశాఖ భూ అక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం వైసీపీ నేతలను మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. మొత్తానికి టీడీపీ ఆధ్వర్యంలో వస్తున్న విశాఖ ఫైల్స్ ఎవరి కొంప ముంచుతుందనేదే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది