YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంకా కోలుకోని వైసీపీ...

ఇంకా  కోలుకోని వైసీపీ...

తిరుపతి, జూలై  17
త్తూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే 2014 ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. 2019లో తన బలాన్ని ఏకంగా 13 స్థానాలకు పెంచుకుంది. ఇక తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఒక స్థానం నుంచి ఏకంగా 12 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది టీడీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయినా.. స్థానిక పరిస్థితులు, సామాజిక లెక్కలతో వైసీపీయే ఆధిపత్యం చలాయించేది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వీచిన ఎదురుగాలికి.. చంద్రబాబు హవా కూడా తోడు కావడంతో వైసీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారక నాథరెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఓడిపోయిన 12 మందిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన నేతలు అంతా ఫలితాల విడుదల తర్వాత పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశమవుతోంది.మాజీ సీఎం వైయస్ జగన్‌కు సన్నిహితులుగా ముద్రపడ్డ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. వారి స్థానంలో వారసులను రాజకీయ అరంగేట్రం చేయించారు. వారిద్దరు ఓటమి చెందడంతో మళ్లీ నియోజకవర్గాల బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్లీ యాక్టివ్‌ అవ్వగా, భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ రెడ్డి మాత్రం ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. టీటీడీ చైర్మన్ పదవికి కరుణాకర్ రెడ్డి, తిరుపతి డిప్యూటీ మేయర్ పదవికి అభినయ్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జాడ తెలియడం లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారని చెబుతున్నారు.చిత్తూరు వైసీపీలో ఎందరో కీలక నేతలు ఉండగా, ఓటమి అందరినీ కోలుకోలేని దెబ్బతీసింది. ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా నగరిలో ఎదురైన పరాభవంతో బయటకు రావడం లేదు. నగరిలో ఇంటికే పరిమితమైన రోజా మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. పార్టీ కార్యకర్తలతోనూ ఆమె మాట్లాడటం లేదు. అదేవిధంగా గంగాధర నెల్లూరులో పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి కూడా ఇంటికి పరిమితమయ్యారు. ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి… తన కుమార్తె ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితాల తర్వాత కుటుంబ సభ్యులతోనే ఆయన గడుపుతున్నారుఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని చిత్తూరు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న విజయానంద రెడ్డి.. ఫలితాల విడుదల తర్వాత పత్తా లేకుండా పోయారు. సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులోకి రావడం లేదు. ఇదే విధంగా మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే టికెట్‌కు ఎసరు పెట్టిన మదనపల్లి నేత నిస్సార్ అహ్మద్ కూటా ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఆయనా ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. పెద్దిరెడ్డి ఆశీస్సులతో సరిగ్గా ఎన్నికలకు ముందు నిస్సార్ అహ్మద్ మదనపల్లి వైసీపీ అభ్యర్థిగా మారారు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నిస్సార్ అహ్మద్‌కు ఎన్నికల ఫలితం తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. ఆయన ప్రస్తుతం కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నారు.ఇక పీలేరును తన అడ్డాగా మార్చుకుని…. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రామచంద్రారెడ్డి సైతం ఓటమితో కుంగిపోయారు. ఓటర్లు ఇచ్చిన షాక్‌తో ఆయన పూర్తిగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పలమనేరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ జాడ తెలియడం లేదు. ఆయన బెంగళూరుకు వెళ్లిపోయినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వెంకట్ గౌడకు 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిపై వెంకట గౌడ అనూహ్య విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో వెంకట గౌడను ఓడించి అమర్నాథరెడ్డి ప్రతీకారం తీర్చుకున్నారు. ఓటమి తర్వాత వెంకట్ గౌడ బెంగళూరుకు వెళ్లిపోయారు గత 20 రోజుల్లో ఆయన ఒకటి రెండుసార్లు నియోజకవర్గానికి వచ్చారు తప్ప పూర్తిగా బెంగళూరుకి పరిమితమయ్యారు.ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో సత్యవేడు వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న రాజేష్.. సత్యవేడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన సొంత నియోజకవర్గం తిరుపతి. ఎస్సీ రిజర్వుడు స్థానమైన సత్యవేడులో ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్‌ ఇచ్చింది వైసీపీ. రాజేశ్‌ రాకతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సత్యవేడులో మార్పు వైసీపీ ఓటమికి కారణమవగా, ఎన్నికల తర్వాత చుక్కాని లేని నావలా తయారైంది వైసీపీ పరిస్థితి.ఇదేవిధంగా పూతలపట్టు, కుప్పంలో పోటీ చేసిన వైసీపీ నేతలు సైతం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్‌ అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వైసీపీని పూర్తిగా డ్యామేజ్‌ చేసింది. ఎన్నికల విజయం తర్వాత టీడీపీ దూకుడుగా ఉంటే.. తమ నాయకులు ముఖం చూపకపోవడం వల్ల… అధికార పార్టీకి టార్గెట్‌ అవుతున్నామని వాపోతున్నారు కార్యకర్తలు.

Related Posts