YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అసంతృప్తులను బుజ్జగించే పనిలో మోడీ, షా

 అసంతృప్తులను బుజ్జగించే పనిలో మోడీ, షా

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చూస్తోంది. కీలక మిత్రులు దూరమవుతున్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి దారిలో వారు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కీలక మిత్రుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పరిస్థితి కొంత ఇబ్బందిగా మారింది. ఇక మరో సుదీర్ఘ మిత్రపక్షమైన శివసేన కూడా చాలా రోజులు గా దూరంగా నే ఉంటోంది. ఇదే సమయంలో బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే మోడీ పోకడపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.మహారాష్ట్ర లోని పాల్ఘర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీపై శివసేన అభ్యర్థిని నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో శివసేన ఓడిపోయి నప్పటికీ బీజేపీ నేతలకు ముచ్చెమటలు పట్టించింది. శివసేన అభ్యర్థి కి 243210 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కేవలం 29573 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదిలా ఉండగా… ఈనెల 7న బీజేపీ ఎన్డీయే మిత్రపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. వచ్చే 2019 ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరనున్నారు.అయితే శివసేన ఎంపీ సంజయ్ రావుత్ కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత ఉద్దవ్ ఠాక్రే ను కలవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు అకాళీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాద‌ల్‌ను కూడా అమిత్ షా ఈనెల 7న కలవనున్నారు. బీజేపీపై అకాళీదళ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక బీహార్ లో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో తమకు 25సీట్లు, బీజేపీ కి 15సీట్లు అంటూ మనసులో మాట చెప్పేసి సీట్ల పంపకంపై సెగలు రేపారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలో కి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.మరోవైపు బీజేపీ యేతర పక్షాలు కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి బీజేపీ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపై కి వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ యేతర పక్షాలు ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపి కమలదళాన్ని మట్టికరిపించిన విషయం విదితమే.గ‌త ఎన్నిక‌ల్లో మోడీ పీఎం అయ్యేందుకు యూపీ ఆయువుప‌ట్టుగా నిలిచింది, మొత్తం 80 సీట్ల‌కు బీజేపీ 72 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు మోడీని కొట్టేందుకు విప‌క్షాలు క‌లిసి పోవ‌డంతో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి అసంతృప్తులు రాకుండా ఉంటే బీజేపీ పరిస్థితి మరింత గందరగోళంగా మారే ప్రమాదం ఉంది. ఇందుకోసమే అసంతృప్త నేతలను సమావేశానికి ముందే కలసి మద్దతు కోరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి మరి.

Related Posts