విజయవాడ, జూలై 18
పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 18 నుంచి 28 వరకు నాల్గవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు, సభ్యత్వ రెన్యుల్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. జనసేన క్రియాశీలక సభ్యులకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50 వేల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని జనసేన పేర్కొంది.ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు జనసేన ప్రకటించింది. వెయ్యి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు 6.47 లక్షల మంది క్రియాశీల సభ్యులతో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం అయ్యే క్రియా శీలక సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం అని జనసేన ప్రకటించింది. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పార్టీ సూచించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. పార్టీ సభ్యత్వం ప్రతి గ్రామం, ప్రతి వార్డులో నిర్వహించాలని శ్రేణులుక సూచించింది.