గడ్చిరోలి
ఛత్తీస్ ఘడ్ అడవులు మరోసారి రక్తసిక్తమయ్యాయి. గడ్చిరోలి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గడ్చిరోలి నుండి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమయింది. వన్డోలి గ్రామ సమీపంలో 12-15 మంది నక్సల్స్ మీటింగ్ అయినట్లు సమాచారంఅందింది. దాంతో అక్కడికి డిప్యూటి ఎస్పీ నేతృత్వంలో ఏడు సి60 పార్టీలను పంపారు. మధ్యాహ్నానికి భారీ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు 6 గంటలకు పైగా అడపాదడపా కొనసాగాయి. తరువాత ఈ ప్రాంతంలో సోదాల్లో ఇప్పటి వరకు 12 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతిచెందిన వారిలో తిప్పగడ్డం దళం ఇన్చార్జ్ లక్ష్మణ్ అత్రం వున్నట్లు సమాచారం.మూడు ఏకే 47, రెండు ఎన్సాన్, ఒక కార్బైన్, ఒక ఎస్ఎల్ఆర్ సహా ఏడు ఆటోమోటివ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.ఘటనలో ఒక ఎస్సై, ఒక జవానుకు గాయాలయ్యాయి.