YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

దక్షిణాఫ్రికాపై కోహ్లీసేన విజయం 

దక్షిణాఫ్రికాపై కోహ్లీసేన విజయం 

- ఐదు వికెట్లతో షమి విజృంభణ

జొహనెస్‌బర్గ్‌: ఓటమెరుగని వాండరర్స్‌లో కోహ్లీసేన చిరస్మరణీయ విజయం అందుకుంది. బౌలర్లు సమష్టిగా విజృంభించిన వేళ ఆతిథ్య దక్షిణాఫ్రికాను 63 పరుగుల తేడాతో చిత్తుచేసింది. 241 పరుగుల లక్ష్యం ఛేదనకు దిగిన ఆ జట్టును 177 పరుగులకే కంగుతినిపించింది. చివరి టెస్టులో గెలుపుపై ఆశలే లేని స్థితిలోంచి విజయ శిఖరాలు అధిరోహించింది. మూడు టెస్టుల సిరీస్‌లో డుప్లెసిస్‌ సేన ఆధిక్యాన్ని 1-2కి తగ్గించింది. త్వరలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ప్రమాద ఘంటికలు మోగించింది. అటు బంతితో.. ఇటు బ్యాటుతో రాణించిన భువనేశ్వర్‌ కుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. మొత్తంగా అజింక్య రహానె రాక అదృష్టాన్నే కలిగించింది.

నాలుగో రోజు, శనివారం ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం వర్షం రావడంతో మైదానం తడిగా ఉండటమే ఇందుకు కారణం. నెర్రలు చాచి బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర ఇబ్బంది పెట్టిన పిచ్‌ నేడు అలా లేదు! అంతా సర్దుకున్నట్టే కనిపించింది. ఇలాంటి స్థితిలో ఓవర్‌నైట్‌ స్కోరు 17/1తో ఆట ఆరంభించిన ఆతిథ్య జట్టు సునాయాసంగా పరుగులు సాధించింది. భోజన విరామానికి 69/1తో నిలిచింది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (86 నాటౌట్‌; 240 బంతుల్లో 9×4, 1×6), హషీమ్‌ ఆమ్లా (52; 140 బంతుల్లో 5×4) అర్ధశతకాలు సాధించేసి మంచి ఊపుమీద కనిపించారు. నిలకడైన వారి బ్యాటింగ్‌.. వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతున్న భారత బౌలింగ్‌ చూస్తుంటే ఆతిథ్య జట్టు విజయం నల్లేరుపై నడకలా కనిపించింది. పిచ్‌ మార్పుతో ఇషాంత్‌, భువి, బుమ్రా, షమి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు వేయలేక కష్టపడ్డారు. ఈ క్రమంలో తేనీటి విరామానికి ముందు 124 పరుగుల వద్ద ఆమ్లాను ఇషాంత్‌ పెవిలియన్‌కు పంపించి షాకిచ్చాడు. మరో 7 పరుగులకే ‘మిస్టర్‌ 360’ ఏబీ డివిలియర్స్‌ను బుమ్రా ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరుగుతుందేమో అనిపించింది.

తేనీటి విరామం తర్వాత టీమిండియా బౌలింగ్‌ దాడిని మరింత తీవ్రతరం చేసింది. షమి (5/28), బుమ్రా (2/57), ఇషాంత్‌ (2/31), భువి (1/39) విజృంభించి వెంటవెంటనే వికెట్లు తీశారు. జట్టు స్కోరు 144 వద్ద డుప్లెసిస్‌ (2)ను ఇషాంత్‌, 145 వద్ద డికాక్‌ (0)ను బుమ్రా అద్భుతమైన బంతులతో పెవిలియన్‌ పంపించారు. అయితే అప్పటికీ ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ బ్యాటింగ్‌లో తీవ్రత తగ్గలేదు. టెయిలెండర్లతో కలిసి అతడు పోరాడుతూనే ఉన్నాడు. చక్కని బౌండరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలో 157 వద్ద ఫిలాండర్‌ (10)ను, ఫెహ్లుక్‌వాయో (0)ను షమి బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ గమనాన్ని ఒక్కసారిగా మార్చేశాడు. మరో 3 పరుగులకే రబాడ (0)ను భువి ఔట్‌ చేయడం దక్షిణాఫ్రికా 160/8తో నిలిచింది. ఇక చివరి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ మోర్కెల్‌ (0)ను, లుంగి ఎంగిడి (4)ని షమి పెవిలియన్‌కు పంపించి జట్టుకు విజయాన్ని అందించాడు.

జట్టు స్కోర్లు:

భారత తొలి ఇన్నింగ్స్‌: 187., దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 194.,

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 247., దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 177 ఆలౌట్‌ (నాలుగో రోజు 73.3 ఓవర్లకు)

 

Related Posts