విజయవాడ, జూలై 19,
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇటు టీడీపీ మద్దతు కేంద్రంలో అవసరం. దానిని నొప్పించకుండా అడుగు ముందుకు వేయాలి. మెప్పిస్తూనే ఒప్పించి తమ పనని పూర్తి చేసుకోవాలి. అలాగని పార్టీకి విధేయులైన వారినే ఎంపిక చేయాలి. ఇక శాసనమండలిలో ఏ ఒక్కటి ఖాళీ అయినా అది కూటమి ఖాతాలోనే పడుతుంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలను పక్కన పెడితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతి సారీ కూటమి అభ్యర్థులే దానిని సొంతం చేసుకుంటారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ అయినా అంతే. అన్నీ కూటమి ఖాతాలోనే పడతాయి. బలాబలాలను చూస్తే ఒక్క ఎమ్మెల్సీ పోస్టు కూడా వైసీపీకి ఈ ఐదేళ్లలో దక్కే అవకాశం లేదు భవిష్యత్ లో ఖాళీ అయ్యే పోస్టులను మిత్రపక్షాలకు కూడా పంచాల్సిన పరిస్థితి టీడీపీది. జనసేన, బీజేపీకి కూడా 29 అసెంబ్లీ స్థానాలు ఉండటంతో వాటిని కాదని చంద్రబాబు తమ అభ్యర్థులను బరిలోకి దింపరు. అదే సమయంలో ఖాళీ అవుతున్న పోస్టులలో కొన్ని జనసేనకు, మరికొన్ని బీజేపీకి విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. జనసేన విషయానికి వచ్చే సరికి అది పూర్తిగా పవన్ కల్యాణ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆయన అనుకున్న వారికి ఎమ్మల్సీ ఛాన్స్ దక్కుతుంది. ఇక టీడీపీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కోసం కష్టపడిన నేతలతో పాటు సామాజికవర్గాల సమతూకంతో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక చేస్తారు. వీరిద్దరి విషయంలో ఒక స్పష్టత అయితే ఉంది. ఆరెండు పార్టీల్లో ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు కానీ బీజేపీ అందుకు పూర్తి వ్యతిరేకం. కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అయితే శాసనమండలి అంటే విధేయత, ట్రాక్ రికార్డును ఖచ్చితంగా చూస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్ల నరసాపురం పార్లమెంటు సీటును శ్రీనివాసవర్మకు పార్టీని నమ్ముకున్నందుకే ఇచ్చారు. అలాగే మంత్రి పదవి విషయంలో సత్యకుమార్ పేరు ఖరారయిందంటే అది కమలం పార్టీలో ఆయనకున్న ట్రాక్ రికార్డును చూసే. మిగిలిన నేతలను పక్కన పెట్టి వీరిద్దరినీ ఎంపిక చేసిందంటే తాము పార్టీ విధేయులకు, జెండామార్చకుండా ఏళ్ల నుంచి భుజాన మోసిన నేతలకే ప్రయారిటీ ఇస్తామని కేంద్ర నాయకత్వం చెప్పకనే చెప్పింది. దీన్ని బట్టి చూస్తే బీజేపీకి భవిష్యత్ లో దక్కే ప్రతి పదవిలోనూ కూర్చుండబోయేది పార్టీలో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిస్థితుల్లో మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి రావచ్చని అంచనాలు వినపడుతున్నాయి. ఆయన ఇటీవల రాజమండ్రి అసెంబ్లీ సీటు ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీతో సుదీర్ఘ అనుబంధంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కూడా సోము వీర్రాజుకు ఉండటంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే మరో నేత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి కూడా రేసులో ఉండటం గ్యారంటీ అంటున్నారు. విష్ణు కూడా హిందూపురం పార్లమెంటు స్థానం, కదిరి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ దక్కలేదు. వీరంతా గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో భవిష్యత్ లో కూటమి తరుపున బీజేపీకి దక్కే ఎమ్మెల్సీ స్థానాలకు వీరిద్దరి పేర్లు ఖరారవ్వడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఒకర ఉభయ గోదావరి, మరొకరు రాయలసీమ ప్రాంతం కావడంతో మరో ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందన్నది.