విజయవాడ
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్న మండల వెంకటరమణ అదృశ్యమైన నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.
ఎంపిడివో కృష్ణాజిల్లా కానూరు మండలం మహదేవపురంలో నివాసం ఉంటారు. ఈనెల 15వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో తనకు మచిలీపట్నంలో ఒక ముఖ్యమైన పని ఉందని వెళ్లి వస్తానని భార్యకు చెప్పి తను వచ్చేసరికి కొంత ఆలస్యం కావచ్చని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో తన చిన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా లెటర్ రాసిపెట్టి తనకు ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అలాగే ఇతర సమస్యలు ఉన్నాయని తెలియజేస్తూ షేర్ చేశాడు. ఆ సమాచారం చూసిన వెంటనే చిన్న కుమారుడు తెల్లవారుజాము 03:00 గంటల సమయంలో పెనమలూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
పోలీసులు వెంటనే స్పందించి ఆ తెల్లవారుజామునే ఒక బృందాన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్ కి పంపించడం జరిగింది. రైల్వే స్టేషన్ కి వెళ్లిన బృందానికి అక్కడ 15వ తారీకు మధ్యాహ్నం 02:30 నిమిషాల సమయంలో విజయవాడ వెళ్లడానికి టికెట్ తీసుకున్న రమణ రావు ను సీసీ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. ఆ తదుపరి సీసీ కెమెరాలు ఆధారం చేసుకుని ప్రతి రైల్వే స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీ చేసుకుంటూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు.
ఒకవైపు సీసీ కెమెరాలను ఒక బృందం పరిశీలిస్తూ ఉండగా, మరొక బృందం ఆయన యొక్క కాల్ డీటెయిల్స్ ను, గూగుల్ మ్యాపింగ్ ను అనుసరించి మధురానగర్ వద్ద దిగడాన్ని, ఆ ప్రదేశంలో సంచరించినట్లు గుర్తించారు. తదుపరి అతని యొక్క రెండవ ఫోన్ 15-16వ తేదీ మధ్యరాత్రిలో చివరి ఆక్టివిటీ ఏలూరు కాలువ దగ్గర గుర్తించడంతో ఆయనకున్న వ్యక్తిగత కారణాలు దృష్ట్యా ఆత్మహత్య చేసుకోవచ్చేమో అనే అనుమానంతో ఏలూరు కాలువ చుట్టుపక్కల ప్రాంతాలను ఎన్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసు దర్యాప్తు, గాలింపు చర్యలు కృష్ణాజిల్లా ఎస్పీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 4 డిఎస్పీలు, 4 సీఐలు 15 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.