YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రుణమాఫీ కోసం 400 ఎకరాల తాకట్టు

రుణమాఫీ కోసం 400 ఎకరాల తాకట్టు

హైదరాబాద్, జూలై 19,
ఇప్పటివరకు పూర్తి చేసిన రుణమాఫీతో కాకుండా ఇంకా రూ. 24వేల కోట్లు అవసరం. నెలాఖరులో లక్షన్నర... ఆగస్టు పదిహేనులోపు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే.. మరో నెల రోజుల్లోనే రూ. 24 వేల కోట్లను సమీకరించాల్సి ఉంటుంది. దీనికి  తగ్గ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. ఆర్‌బీఐ నుంచి ప్రతి మంగళవారం తీసుకునే వెసులుబాటు ఉన్న రుణాలతో పాటు.. భూములను తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందు కోసం అంతర్గతంగా ప్రక్రియ జరిగిపోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అత్యంత విలువైన ఆదాయ వనరు భూములు. ఐటీ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఖరీదైన భూములు ఉన్నాయి. వాటిలో  అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.   కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో  20వేల కోట్లు ఉంటుందని అంచనా. వీటిని తాకట్టు పెట్టేందుకు ఓ  మర్చంట్ బ్యాంక్ కోసం టెండర్ ప్రకటన కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఒక్కో ఎకరానికి గరిష్టంగా 50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను  20వేల కోట్లుగా నిర్ణయించారు. కనీసం పదివేల కోట్లు అయిన రుణం అందుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా భూములు తాకట్టు పెట్టడంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసినా.. ప్రభుత్వం స్పందించలేదు. తాము భూములు తాకట్టు పెట్టడం లేదని చెప్పలేదు. ఇంత భారీ మొత్తంలో నిధులు ఎలా సేకరిస్తున్నారన్నదానిపై వస్తున్న అనేక సందేహాలకు.. పూర్తిగా కాకపోయినా.. తమ ముందున్న మార్గాలపై మంత్రి శ్రీధర్ బాబు ఓ ప్రకటన చేశారు. అదేమిటంటే  సంక్షేమ పథకాలకు మూలధన సేకరణలో సెబీ రూపొందించిన సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజి విధానాన్ని వినియోగించుకుంటామని ప్రకటించారు.  నిధుల సమీకరణకు సెబీ, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడి బడా పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తామని అంటున్నారు. దీనిపై ఆయన ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు.  ఎక్విప్ దేశీ  అనే పెట్టుబడుల సేకరణ సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి  ప్రతినిధులు, ప్రభుత్వ కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన ఆర్థిక బాధ్యత, నిర్వహణ   పరిమితులకు లోబడి ఫండ్ సేకరణ జరపడానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అత్యవసరమని శ్రీధర్ బాబు చెబుతున్నారు.  సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్‌ మార్కెట్‌కి వెళ్లొచ్చు. 2019-20 సంవత్సరపు బడ్జెట్‌లో సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రతిపాదన వచ్చంది. ఎన్‌‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. ఉన్నతి ఫౌండేషన్‌  అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చేందుకు  సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదుచేసుకుంది. ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. తాము కూడా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి.. లాభాపేక్ష లేకుండా తమ వద్ద పెట్టుబడులు పెట్టాలని ఈ విధానం ద్వారా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. దీని ద్వారా పదిహేను వేల కోట్ల వరకూ సమీకరించాలని అనుకుంటోంది.ఇలా విభిన్న మార్గాలను అంచనా వేసుకుని ఖచ్చితంగా నిధులు సమకూరుతాయనే లెక్కలతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్తున్నారు. ఈ కొత్త విధానాలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు కొత్త దారి చూపిస్తాయని అనుకోవచ్చు

Related Posts