కోనసీమ
పి.గన్నవరం నియోజవర్గంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతుండటంతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి వరద ప్రవహానికి కొట్టుకుపోవడంతో.. నదికి అవతల ఉన్న లంక గ్రామాల ప్రజలు పడవలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. మళ్ళీ వరదల సీజన్ ముగిసేవరకూ ఈ నాలుగు గ్రామాల పరిస్థితి దినదినగండమే.. చిన్నపాటి పనులకు కూడా వీరు నదీపాయను దాటాల్సిందే. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దమనీయం. వరద ప్రవాహంలో రోజూ పడవ దాటుతూ స్కూల్స్ కు వెలుతూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. ఎలాంటి భద్రత లేకుండానే వీరు గోదావరి ఉదృతిలో రాకపోకలు సాగిస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని అయినవిల్లి లంక, కనకాయిలంక కాజ్ వేల పైకి వరద నీరు చేరుతుంది. దీనితో చాలా లంక గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోనున్నాయి.
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో లోతట్టు ప్రాంతాలుముంపుకు గురవుతున్నాయి. రాజమండ్రిలోని కంబాల చెరువు ఇన్నిసు పేట, వి ఎల్ పురం ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏజెన్సీలోని చింతూరు మండలంలోని రెండు గ్రామాలకు రాకపోకలు నిలిపివేసారు. దేవీపట్నం గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. వరద ప్రభావం కారణంగా పాపికొండల టూరిజం బోట్లను నిలిపివేసారు. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం10.60 అడుగులకు చేరుకుంది. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి ఎప్పటికప్పుడు నీటిని ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతునన్నారు. ప్రతిరోజు సుమారుగా లక్ష క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు.భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గినప్పటికీ ఇక్కడ మాత్రం నీటిమట్టం పెరుగుతోంది.ముంపు పెరిగితే విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశంవుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసారు.