YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలకలం రేపుతున్న రాజకీయదాడులు

కలకలం రేపుతున్న రాజకీయదాడులు

విజయవాడ, జూలై 20
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు, హింసాత్మక ఘటనలు అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరిగడానికి కారణం అవుతున్నాయి. గత నెలలో కనీవిని ఎరుగని మెజార్టీతో అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు జరిగినా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌ ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయకుల్ని పదేపదే హెచ్చరిస్తున్నారు రౌడీయిజం, గుండాయిజాన్ని సహించేది లేదని, నాయకులు సంయమనం పాటించాలని కొత్త ప్రభుత్వాన్నిముందుకు తీసుకు వెళ్లేందుకు సహకరించాలని కోరుతున్నారు.పార్టీ అధినేతలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా దాడులు, హింసాత్మక ఘటనలకు మాత్రం అడ్డు పడటం లేదు. బుధవారం రాత్రి వినుకొండలో వైసీపీ సానుభూతిపరుడైన యువకుడిని ప్రత్యర్థి దారుణంగా నరికి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. గత నెల రోజులుగా అధికార పార్టీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు పెద్దగా ప్రచారం లభించకపోయినా బుధవారం జరిగిన యువకుడి దారుణ హత్య అందరిని ఉలిక్కి పడేలా చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీని బదిలీ చేసిన రోజుల వ్యవధిలో పల్నాడులో జరిగిన హత్య, వైసీపీకి రాజకీయంగా ఊపిరి పోసింది.నడిరోడ్డుపై జరిగిన హత్యపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గురువారం ఉదయంలోపు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వైరల్‌గా మారాయి. టీడీపీ జరుగుతున్న నష్టాన్ని గుర్తించేలోపు వినుకొండ యువకుడి హత్య ఘటన వైరల్‌ అయిపోయింది. టీడీపీ నేతలు హత్యకు పాల్పడిన జిలానీ తమ పార్టీకి చెందిన వాడు కాదని, ఇద్దరి మధ్య పాతకక్షలతో ఘటన జరిగిందని చెప్పుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.ఏపీలో ఘోర పరాజయం తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆసక్తి చూపలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండటానికే జగన్ బెంగుళూరు వెళ్లిపోయారని టీడీపీ నేతలు విమర్శించారు. వినుకొండలో రషీద్ హత్య తర్వాత జగన్‌ వెంటనే విజయవాడ వచ్చారు.బుధవారం రాత్రి వినుకొండలో రషీద్ అనే యువకుడిని షేక్ జిలానీ అనే మరో యువకుడు హత్య చేశాడు. వీళ్లిద్దరూ ఒకప్పుడు స్నేహితులే. వైసీపీలో ఉండేవారు. వినుకొండలో రౌడీగా చలామణీ అవుతున్న పీఎస్ ఖాన్ ముఠాలో రషీద్, జిలానీ సభ్యులుగా ఉండేవారు. తర్వాత . వీరి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. 2022 తొలి ఏకాదశి రోజున వినుకొండలో జరిగే కొండ తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.ఖాన్ ఓ లాడ్జిలో నిర్వహించిన పార్టీలొ జిలానీ బీర్ బాటిళ్లతో దాడి చేయడంతో ఒక యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో ఖాన్.. రషీద్ కు మద్దతుగా నిలిచాడు. జిలానీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రషీద్, ఖాన్ గ్యాంగ్‌లో మరి కొందరు గత ఏడాది జూలైలో జిలానీ ఇంటిపై దాడి చేశారు. జిలానీ ఇంట్లో లేకపోవడంతో అతని అన్న జానీపై దాడి చేసి గాయపరిచారు.ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ఇంటి ముందు వాహనాన్ని కూడా తగలపెట్టారు. ఎమ్మెల్యే బొల్లా కారణంగా పోలీసులు జిలానీ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోలేదు. యువకుడిపై దాడి కేసులో జిలానీపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. దీంతో గత ఏడాది అతని టీడీపీ గూటికి చేరాడు. అదను చూసి హత్యకు పాల్పడ్డాడు. తన ఇంటిపై రషీద్ దాడి చేసిన రోజే ప్రత్యర్థిని మట్టుబెట్టాడు.జిలానీ, రషీద్‌ల మధ్య ఉన్న వ్యక్తిగత శతృత్వాలకు రాజకీయాలు అండగా నిలవడతంతో అవి కాస్త హత్యలకు తెగించేలా ప్రోత్సహించాయి. వినుకొండలో హత్య తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదలను కూడా వాయిదా వేసుకున్నారు. గురువారం శాంతిభద్రతలపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది. అదే సమయంలో వినుకొండ హత్య తీవ్ర సంచలనం సృష్టించడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. వచ్చే వారం మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో వాటిని విడుదల చేయాలని నిర్ణయించారు.వినుకొండలో జరిగిన హత్యపై వైసీపీ అధ్యక్షుడు ప్రధానికి లేఖరాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని,వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమను సమర్థించని, తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా మా పార్టీ.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది.తమ కార్యకర్తల్ని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారు. వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారు. పట్టపగలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ ఘటనలు రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి నెలకొనేలా చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం హత్యకు గురైన రషీద్‌ను పరామర్శించేందుకు వినుకొండ వెళ్లారు.పార్టీలు మారినా పాలనలో మార్పు రాకపోవడంపై ఏపీ ప్రజల్లో నిర్లిప్తత ఏర్పడింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే రాజకీయ వాతావరణం హింసాత్మకం తయారవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్లో చాలామంది సేవల్ని ప్రభుత్వం వాడుకునే పరిస్థితులు లేవు. గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే కారణాలతో వారిని పూర్తిగా పక్కన పెట్టేశారు.కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి బోలెడు సవాళ్లు ఉన్నాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓ వైపు ఎన్నికల హామీల అమలుపై పైసపైస కూడబెట్టుకుంటోంది. ఈ క్రమంలో రాజకీయంగా ప్రత్యర్థులు బలపడేలా జరుగుతున్న ఘటనలు, వాటిని కనీసం ఖండించలేని వాతావరణం రాష్ట్ర ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలు మారినా ఏపీ తలరాత మారదనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Related Posts