అనంతపురం, జూలై 20
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యారు. గతంలో 2014లో ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిల్ సమావేశంలో పాల్గొనగా.. జేసీ అస్మిత్ రెడ్డి కౌన్సిలర్ గా సమావేశంలో పాల్గొన్నారు. తాజా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అస్మిత్ రెడ్డికి కీలక విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం ప్రజా సమస్యలపై, తాడిపత్రి మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అసెంబ్లీలో చర్చిచాలని, తద్వారా నిధులు తీసుకొచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని ప్రభాకర్ రెడ్డి కోరారు. అంతకుముందు కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిల్ సమావేశంలో తండ్రీ, కొడుకులను చూసి జేసీ కుటుంబం అభిమానులు, టీడీపీ శ్రేణులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.జేసీ అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ.. కౌన్సిల్ సభ్యులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గం సమస్యలు, మున్సిపల్ సమస్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారని అస్మిత్ రెడ్డి అన్నారు. అలాగే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ తాడిపత్రి నియోజకవర్గం సమస్యలపై ప్రస్తావిస్తానని కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు.
నా నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరికీ ప్రాధాన్యత ఇస్తాను. వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు మీ వార్డుల్లో ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి దయతోనే నేను ఎమ్మెల్యే అయ్యాను. నామీద నమ్మకం ఉంచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు.