YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తప్పయిందంటున్న తెలుగు తమ్ముళ్లు...

తప్పయిందంటున్న తెలుగు తమ్ముళ్లు...

విశాఖపట్టణం, జూలై 20
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో…. గతంలో ఆ పార్టీలో చేరిన టీడీపీ మాజీ నేతలు మళ్లీ తెలుగుదేశం పార్టీ తలుపుతడుతున్నారట… తెలియక తప్పు చేశాం సరిదిద్దుకునే చాన్స్‌ ఇవ్వండంటూ అధిష్టానానికి వర్తమానం పంపుతున్నారని సమాచారం. ఇలా టీడీపీలో తిరిగి చేరాలనుకుంటున్న వారిలో కొందరు.. తమకు రూట్‌ క్లియర్‌ అయిందని చెప్పుకుంటుండగా, మరికొందరు నేడో రేపో పసుపు కండువాలు కప్పుకోవడమే బ్యాలెన్స్‌ అని ప్రచారం చేస్తుండటం ఆయా నియోజకవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత అసెంబ్లీలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో టీడీపీలో కీలకంగా పనిచేసిన కొందరు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇలా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిన నేతలు… గత ఐదేళ్లలో పార్టీపైన.. అధినేత చంద్రబాబుపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి.. వార్తల్లో నిలిచారు. దీంతో పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌కుమార్‌ టీడీపీ శ్రేణులకు టార్గెట్‌గా మారారంటున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో ఆ నేతలు అంతా మళ్లీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని… వారిని ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోవద్దని పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు.టీడీపీని వీడిన నేతలు అందరూ వైసీపీలో నష్టపోయారని… అందుకే తిరిగి వచ్చేస్తామంటున్నారనే అభిప్రాయపడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. గుంటూరు పశ్చిమ నుంచి మద్దాల గిరికి వైసీపీ టికెట్‌ కూడా ఇవ్వకపోగా, కరణం బలరాం తన కుమారుడు వెంకటేశ్‌ను చీరాల బరిలోకి దింపారు. వాసుపల్లి, వల్లభనేని వంశీ పోటీ చేసినా చిత్తుగా ఓడిపోయారు. ఇక వల్లభనేని వంశీ అయితే ఎన్నికల ఓటమి షాక్‌తో ఆచూకీ లేకుండాపోయారు. గత ఐదేళ్లలో ఆయన వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ అండ లేకపోతే మున్ముందు మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే భయంతో పార్టీ మారిన ఈ మాజీ నేతలతోపాటు టీడీపీతో అనుబంధం ఉన్న మరికొందరు నేతలు కూడా ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి వచ్చేస్తామని కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది.విశాఖ జిల్లాకు చెందిన వాసుపల్లి గణేశ్‌తోపాటు మాజీ మంత్రి అవంతి తిరిగి టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా తమ ప్రయత్నాలు చేయగా, అధిష్టానం మొదట్లోనే చెక్‌ పెట్టిందంటున్నారు. ఈ ఇద్దరు నేతలకీ విద్యా వ్యాపారాలు ఉండగా, ప్రభుత్వం మారడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ముందు జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఇక విశాఖ జిల్లాకే చెందిన మరో వైసీపీ నేత అడారి ఆనంద్‌కుమార్‌ కూడా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆనంద్‌కుమార్‌ ఈ ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.2019లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆనంద్‌కుమార్‌ కుటుంబానికి విశాఖ డెయిరీ రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఆయనను వైసీపీ చేర్చుకుంది. ఆనంద్‌కుమార్‌ తండ్రి అడారి తులసీరావుకు ఉత్తరాంధ్రలో రైతుల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆయన జీవించి ఉన్నంతకాలం టీడీపీలోనే కొనసాగారు. కానీ, అప్పటి రాజకీయాల వల్ల ఆనంద్‌కుమార్‌ వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. తమ కుటుంబానికి పార్టీతో ఉన్న అనుబంధం దృష్టిలో పెట్టుకోవాలని ఆనంద్‌ టీడీపీ పెద్దలను కోరుతున్నట్లు సమాచారం. ఆనంద్‌తోపాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీలా రమాకుమారి సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.ఇలా విశాఖ జిల్లా నేతలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా కొందరు నేతలు తిరిగి సొంతగూటికి వచ్చేస్తామని మెసేజ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే పార్టీ కష్ట కాలంలో ఉండగా, వెళ్లిన ఏ ఒక్కరినీ తిరిగి చేర్చుకోవద్దని ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు హైకమాండ్‌ను కోరుతున్నారని సమాచారం. కార్యకర్తల అభ్యంతరాలతో అధినేత చంద్రబాబు సైతం ప్రస్తుతానికి చేరికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతానికి టీడీపీకి ఏ ఒక్కరినీ చేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ, వైసీపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు మాత్రం అధిష్టానం మనసు కరగకపోతుందా? అంటూ పట్టు వదలని విక్రమార్కుడిలా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ మాజీ నేతల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే…

Related Posts