YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

షాడో కేబినెట్ తో నవీన్ పట్నాయక్

షాడో కేబినెట్ తో నవీన్ పట్నాయక్

భువనేశ్వర్,జూలై 20,
ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు వరుసగా 5 సార్లు బిజు జనతా దళ్.. గెలిచి ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఏకంగా 25 ఏళ్ల పాటు ఏకచత్రాధిపత్యంగా ఒడిశా రాష్ట్రాన్ని పాలించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో.. నవీన్ పట్నాయక్.. సీఎం సీటు నుంచి దిగిపోయారు. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచేందుకు షాడో కేబినెట్ ఏర్పాటు చేశారు. 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలను కేటాయించారు. దీంతో మన దేశ చరిత్రలోనే ఓడిపోయిన పార్టీ తమ ఎమ్మెల్యేలకు శాఖలు కేటాయించి.. బీజేడీ రికార్డుల్లోకి ఎక్కింది.ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగా.. మోహన్ మాంఝీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వానికి చెక్‌ పెట్టడంతోపాటు.. ప్రజలకు జవాబుదారీని చేసేందుకు నవీన్ పట్నాయక్ షాడో క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. బీజేడీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు శాఖలు కేటాయించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు.. ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రతాప్ దేబ్ పర్యవేక్షించనున్నారు. మాజీ మంత్రి నిరంజన్ పూజారి.. గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలు చూసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే షాడో కేబినెట్‌కు సంబంధించిన ఉత్తర్వులను బీజేడీ జారీ చేసింది.అయితే బీజేడీ నేతృత్వంలో.. మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఏర్పాటు చేసిన ఈ షాడో కేబినెట్‌కు ఎలాంటి అధికారాలు ఉండవు. పైగా ఇది ప్రభుత్వ అధికారిక సంస్థ కూడా కాదు. ఇక జూలై 22 వ తేదీ నుంచి ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను పరిశీలించేందుకు గాను షాడో కేబినెట్‌ను నియమించారు. ఇక బడ్జెట్‌ సమావేశాల బాధ్యతను ఈ షాడో కేబినేట్‌కు అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు.. సంబంధిత మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నారు. ఇలా చేయడం వల్ల సీఎం మోహన్ మాఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఒక రాష్ట్రంలో షాడో కేబినెట్ ఏర్పాటు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలాంటి షాడో కేబినెట్‌లు విదేశాల్లో ఉంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్‌లో ప్రతిపక్ష పార్టీలు షాడో కేబినెట్‌లు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. కెనడాలో షాడో కేబినెట్ సభ్యులను ప్రతిపక్ష విమర్శకుడుగా వ్యవహరిస్తారు. ఇక బ్రిటన్‌లోని షాడో కేబినెట్‌లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. అధికార పార్టీకి చెందిన ప్రతీ మంత్రికి ఒక షాడో నేతను నియమిస్తారు. ఆ మంత్రి పనితీరు, అభివృద్ధి విధానాలను వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ మంత్రులు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తారు. దీంతో ఆ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ ఇలాంటి షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేస్తూ ఉంటుంది.

Related Posts