YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

క్రాస్ రోడ్ లో గంగుల...

క్రాస్ రోడ్ లో గంగుల...

కరీంనగర్, జూలై 20
ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జిల్లాలో బలమైన బీసీ నేత గంగుల. బీసీ వర్గాలలో మంచి పట్టున్న లీడర్‌గా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కేటీఆర్‌ దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు గంగుల. ఆ ఇద్దరికి నమ్మిన బంటుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. గంగులకు ఏ పని అప్పగించినా, దాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేస్తారని కూడా చెబుతుంటారు. అలా అధినేత నమ్మకాన్ని చూరగొన్న గంగుల.. ప్రస్తుతం పార్టీ అధినాయకత్వానికి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోనూ పార్టీతో పెద్దగా సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు.మాజీ సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా అంటే ప్రత్యేక సెంటిమెంట్‌గా చెబుతారు. అలాంటి జిల్లాలో గంగులకు పెద్దరికం అప్పగిస్తే.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఆయన ఉలుకూ పలుకూ లేకుండా గడపడమే చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా… స్పందించకుండా సైలెంట్‌గానే ఉంటున్న గంగుల తీరు పలు సందేహాలకు తావిస్తోందిఎప్పుడూ హాట్‌హాట్‌ కామెంట్లు చేసే గంగుల ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం… ఆయన అనుచరులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి గంగుల పార్టీ మారతారని చాలా రోజుల క్రితమే ఊహాగానాలు మొదలయ్యాయి. నెక్ట్స్‌ గంగులే అంటూ దాదాపు నెల రోజులుగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, తాను పార్టీని వీడుతానని గానీ, వీడనని గాని ఆయన స్పందించలేదు. తొలినాళ్లలో అధినేత కేసీఆర్‌ను కలిసిన గంగుల.. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు. ఆయన పేరు అలా ప్రచారంలో ఉండగానే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వరుసగా రోజుకొకరు చొప్పున కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఎవరూ ఊహించని విధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌ పార్టీని వీడటంపై జిల్లాలోని కీలక నేతలంతా తప్పుపట్టారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు కూడా పెదవి విప్పలేదు గంగులు.బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతల్లో ఒకరైన గంగుల… అధికారం కోల్పోయాక… పార్టీతో అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తుండటం చర్చకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు అంతా ప్రభుత్వంపై ఏదో రూపంలో పోరాడుతుంటే.. గంగుల మాత్రం గప్‌చుప్‌గానే ఉంటున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గంగులకు ఉన్న పరిచయాలేనా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి గంగుల టీడీపీలో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి గంగుల వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.ఈ పరిస్థితుల్లో గంగుల అంతరంగం ఏంటో అర్థం చేసుకోలేక బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ తర్జనభర్జన పడుతోంది. ఇటు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోనూ… అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ సత్సంబంధాలు కోరుకుంటున్న గంగుల… సైలెంట్‌గా ఉండటమే మేలనుకుంటున్నారా? అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేందుకు గంగుల ఆసక్తిగా ఉన్నా, మంత్రి పొన్నం కారణంగా…. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం కరీంనగర్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.కరీంనగర్‌లో వరుసగా గెలుస్తున్న గంగుల… పొన్నంతో ఆధిపత్య పోరు ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు గంగులపై జరుగుతున్న ప్రచారమంతా.. ఉట్టి గాసిప్పేనని తేల్చేస్తున్నారు ఆయన అనుచరులు. ఏదైనా సరే గంగుల మౌనవ్రతం వీడితేనే ఈ సస్పెన్స్‌కు తెరపడుతుంది. మరి ఆయన ఎప్పటి వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగిస్తారో..? ఆయన అంతరంగం ఎప్పటికి ఆవిష్కరిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.

Related Posts