YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ధర్నా వెనుక బిగ్ ప్లానింగ్

జగన్ ధర్నా వెనుక బిగ్ ప్లానింగ్

గుంటూరు, జూలై 23,
వై నాట్ 175 అంటూ మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కన్న జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కు అర్హులైన ఎమ్మెల్యేలను సైతం గెలిపించుకోలేకపోయారు. ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా టీడీపీ, బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో వైఎస్ఆర్ సీపీని మళ్లీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జగన్ భావిస్తున్నారు. ముందు ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలోనైనా టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే..ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిలో పడాలి. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలి. అంతకన్నా ముఖ్యంగా నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలి. అందుకే ఆ దిశగా జగన్ ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల ఏపీలో సంచలనం కలిగించిన రషీద్ హత్యపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తను అత్యంత కిరాతకంగా నడిరోడ్డున హత్య చేశారని టీడీపీ పై విరుచుకుపడ్డారు జగన్. తెలుగు తమ్ముళ్లు కూడా తగ్గేది లే అంటూ వైఎస్ఆర్ సీపీనే కావాలని హత్య చేయించి హత్యారాజకీయాలకు తెరతీసిందని చెబుతోంది. దీనిపై రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్ సమయంలో జగన్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసా కాండపై అటు గవర్నర్ కు, రాష్ట్రపతికి లేఖలు కూడా రాశారు జగన్. ఇక ఇవన్నీ కాదని ఈ నెల 24న ఢిల్లీ లో ఏపీలో జరుగుతున్న హత్యా రాజకీయాలకు నిరసనగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు.ఇదేదో తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదు. జగన్ ధర్నా వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు రాజకీయ వర్గాలు.23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర సమస్యను పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు చర్చించే అవకాశం ఉంది. దీనిని జాతీయ సమస్యగా మలిచి టీడీపీని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారు జగన్. ఆయన ధర్నా చేసే సమయానికి సరిగ్గా ఏపీలో రషీద్ హత్య జరిగి వారం అవుతుంది. వారం రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వాదించవచ్చు. వీటన్నింటికన్నా ముఖ్యంగా ఏపీలో వైసీపీ శ్రేణులకు తమ పార్టీ యాక్టివ్ గా ఉందని..వాళ్లలో కొత్త ఉత్సాహం ఇవ్వవచ్చని భావిస్తున్నారు జగన్. అందుకే రాష్ట్రంలో ఏ చిన్న అంశాన్నీ వదలకూడదు అని నిర్ణయించుకున్నారు జగన్.అడుగడుగునా టీడీపీని ఇరకాటంలో పెట్టి తగ్గిపోతున్న తన ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని..వచ్చే ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో ఎలాగూ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయి. బయట ధర్నా చేసే జగన్ కు జాతీయ మీడియాలో మంచి కవరేజ్ వస్తుంది. కోట్లు ఖర్చుపెట్టినా రాని పబ్లిసిటీ కేవలం ధర్నా ద్వారా జాతీయ మీడియాలో ఏపీ పరిస్థితిని వివరించవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంకీర్ణ కూటమి లో భాగస్వామి అయిన టీడీపీ పార్టీపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతా. బీజేపీ అలాంటి సాహసం చేయదని తెలుస్తోంది. ప్రయత్నిస్తే పోయేది ఏముంది కనీసం వైసీపీ వార్తలలోనైనా ఉంటుంది. ఈ కార్యక్రమం కార్యకర్తలలో నూతనోత్సాహం కలిగిస్తుంది. ఇలాంటి లెక్కలతోనే జగన్ జాతీయ స్థాయిలో ధర్నాకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts