తిరుపతి, జూలై 23
తిరుపతి కార్పొరేషన్. ఎన్నికల ముందు దాకా ఒకే పార్టీది ఆధిపత్యం. తిరుగులేని నాయకత్వం. ఇప్పుడు సీన్ మారింది. 50 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్‌కు 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీని వైసీపీ సొంతం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 48 స్థానాలను వైసీపీ, ఒక్క డివిజన్ లోనే టిడిపి జెండా ఎగుర వేసింది. మేయర్‌గా శిరీష, డిప్యూటీ మేయర్లుగా భూమన అభినయ్, ముద్దుల నారాయణ ఎన్నిక అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భూమన అభినయ్ తన డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవి చూశారు. దీంతో తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి గేమ్ చేంజ్ ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన 5 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. ఇద్దరు టిడిపిలోకి, ముగ్గురు జనసేనలోకి చేరిపోయారు.ఎన్నికల ముందు ఆ తర్వాత వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిర్యాయింపులపై పెద్ద ప్రచారం జరిగింది. ఇక ఫలితాల తర్వాత ఇప్పుడు జంపింగ్‌కు కార్పొరేటర్లు ఆసక్తి చూపుతున్నారు. మేయర్ శిరీష ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా డిప్యూటీ మేయర్ పొద్దున నారాయణతో పాటు పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. జనసేనలోకి జంప్ చేయాలా, లేదంటే టిడిపిలో చేరాలా అన్న సందిగ్ధతలో ఉన్నారు. ఈ మేరకు వారం రోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో సొంత పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ గళమెత్తిన వైసిపి కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాల తరువాత మాజీ ఎమ్మెల్యే భూమన కుటుంబానికి దూరంగా ఉన్న కార్పోరేటర్లు ఇప్పుడు ఏ పార్టీ జెండాను భుజాన ఎత్తుకోవాలో తేలిక తికమక పడుతున్నారు.ఇందులో భాగంగానే తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు రహస్య సమావేశం అయ్యారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో పాటు పలువురు కార్పొరేటర్లు భేటీ అయ్యారు. టిడిపిలోకి పోవాలా జనసేనలోకి జంప్ కావాలా అన్నదానిపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి కార్పొరేషన్‌పై టిడిపి, జనసేన పార్టీలు పట్టు కోసం ప్రయత్నం చేస్తుండడంతో వైసీపీ మెజార్టీ కార్పొరేటర్ల దారిఎటు అన్న దానిపైనే జోరుగా చర్చ నడుస్తోంది. ఏ పార్టీలో చేరేందుకు ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్‌ను జనసేనకు ఇచ్చేసిన టిడిపి.. కార్పొరేషన్‌పై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే టిడిపికున్న ఒక కార్పొరేటర్ ఎన్నికలకు ముందు చేరిన మరో ఇద్దరు కార్పొరేటర్లతో పాటు మెజారిటీ వైసిపి కార్పొరేటర్లను టిడిపిలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి టిడిపి ఇన్‌చార్జ్‌తోపాటు ముఖ్య నేతలు ఆ పనిలో ఉండగా, జనసేనలోకి జంపింగ్ ఛాన్స్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు.అసలు వైసీపీ కార్పొరేటర్ల పయనం ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితి నెలకొంది. టిడిపి జనసేనకు సమాన దూరంగానే ఉంటూ రాజకీయం చేస్తున్న సినీ నిర్మాత ఒకరు ఈ వ్యవహారంలో కీలకంగా మారారు. తిరుపతి కార్పొరేటర్లను ఈ పార్టీలోకి వెళ్ళాలో దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉన్న ఆ నాయకుడే ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు తిరుపతి కార్పొరేషన్ టిడిపి సొంతం కావాలన్న గట్టి ప్రయత్నమే స్థానిక నాయకత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న అన్నా రామచంద్రయ్య.. కార్పొరేటర్లు అయిన తన ఇద్దరు కూతుర్లతో కలిసి వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ మేరకు కూతురిని తిరుపతి మేయర్ చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లకు ఏ పార్టీకి జై కొట్టాలో కూడా తమ చేతుల్లో లేకుండా పోయిందని అంటున్నారు కొందరు నాయకులు. ఇలా తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల భవితవ్యం ఏ పార్టీతో ముడిపడి ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీల్లో చేర్చుకునేందుకు రెండు పార్టీల హై కమాండ్ నుంచి ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడం కూడా కార్పొరేటర్లను అయోమయానికి గురిచేస్తోంది