YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టూరిజం కేరాఫ్ గోదావరి

టూరిజం కేరాఫ్ గోదావరి
గోదావరి జలవినోదానికి కేంద్రంగా మారుతోంది. ఇదివరకు రాకపోకలు, వేటకోసమే బోట్లు తిరిగేవి. సరుకు, ఇసుక రవాణా బోట్లూ ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు తగ్గుతూ వస్తుంటే, దశాబ్దకాలం నుంచి గోదావరి విహారం బాగా పెరిగింది. అటు పాపికొండలకు వేలాది మంది పర్యాటకులు నిత్యం పోటెత్తుతున్నారు. కోనసీమలో కొబ్బరి చెట్ల నడుమ గోదావరి విహారానికి ఎంతోమంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ విహారానికి ఎక్కువమంది విచ్చేస్తున్న వారిలో రెండు తెలుగురాష్ట్రాల వాళ్లే ఎక్కువ. ఇక నుంచి దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. కోనసీమ విషయానికొస్తే.. రాజోలు మండలం సోంపల్లి నుంచి దిండి, అక్కడ నుంచి అంతర్వేదికి గోదావరి ప్రయాణం ఉంటుంది. దీనిని టూరిజం సర్క్యూట్‌గా ప్రకటించారు. పాశర్లపూడి నుంచి గోదావరి మీదుగా ఆదుర్రు, పాశర్లపూడి నుంచి అప్పనపల్లికి కూడా ఈహౌస్‌బోటు సర్క్యూట్‌ను ప్రకటించారు. ఈవారంలోనే టెండర్లు పిలవనున్నారు. కేరళలో ఈ బోట్లను తయారు చేయించే ప్రయత్నం జరుగుతోంది.
 ఇప్పటికే టూరిజం శాఖ ఈ సర్క్యూట్‌ల గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. కోనసీమ గోదావరి పాయల్లో సముద్రం నీరు, గోదావరి నీరు కలసి ఉంటుంది. బ్లాక్‌ వాటర్‌ ప్రాంతంగా దీనిని పిలుస్తారు. ఈ నీళ్లు చూడడానికి చాలా అందంగా, చల్లగా ఉంటాయి. పేరుకు బ్లాక్‌ వాటర్‌గా పిలుస్తున్నప్పటికీ, నీళ్లు తెలుపే. ఈ నీళ్లలో బోటు ప్రయాణం చాలా బావుంటుంది. కేరళలో ఇటువంటి ప్రాంతాల్లో హౌస్‌బోటు పయనానికి మంచి డిమాండు ఉంది. ఈ బోట్లలో గదులు కూడా ఉంటాయి. బెడ్స్‌ ఉంటాయి. బోటు పైభాగంలో కుర్చీలతో కూర్చుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కూడా సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గోదావరి పుష్కరాల సమయంలో బోటు మీద గోదావరిని పరిశీలించిన చంద్రబాబు ఈ ప్రాంతం టూరిజానికి అనుకూలంగా ఉందని గుర్తించారు.
 అప్పటికప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రంపచోడవరంలోని భూపతిపాలెం రిజర్వాయరు, రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో బోటు షికారు ఊపందుకుంది. కానీ హౌస్‌బోట్లు లేవు. స్పీడ్‌ బోట్లతో వినోదం అందుబాటులో ఉంది. పాపికొండల పర్యటన ఎలానూ ఉంది. కోరంగి మడ అడవులు, దిండి ప్రాంతంలో కూడా బోటు షికారు ఉంది. హౌ్‌సబోట్‌ షికారు ప్రారంభమైన తర్వాత ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో జలవినోదం మరింత పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకూ కూడా బోటు షికారు, అక్కడ కడియం నర్సరీలు చూపించి, మళ్లీ బోటులో ధవళేశ్వరం తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. జొన్నాడ నుంచి కోటిపల్లి, యానాం వరకూ కూడా బోటు షికారు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పాశర్లపూడి, దిండి వద్ద జెట్టీలు నిర్మించారు. పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.

Related Posts