YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తడిసి ముద్దవుతున్న వరంగల్

తడిసి ముద్దవుతున్న వరంగల్

వరంగల్, జూలై 23
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండగా, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ సమీపంలో గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉందివర్షాల నేపథ్యంలో గోదావరిలో నీటి ప్రవాహం పెరగగా, రామన్నగూడెం వద్ద కరకట్ట కోతకు గురవుతోంది. దీంతో ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి తీర ప్రాంత గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏటూరు నాగారం మండలంలోని బెస్త వాడ, ఎస్సీ కాలనీ, రామన్నగూడెం, కొత్తూరు, బుట్టాయిగూడెం; మంగపేట మండలంలోని పోదూరు, అక్కినపల్లి, కమలాపూర్, వాడగూడెం, రమణక్కపేట, కత్తిగూడెం, గుడ్డేలుగుల పల్లి, మంగపేట, బోర్ నర్సాపూర్ గ్రామాలను తరచూ వరదలు వణికిస్తుండగా, కరకట్ట కోతకు గురవుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ములుగు జిల్లాలోని గోదావరి తీర ప్రాంతంలో కరకట్ట నిర్మాణం, మరమ్మతు పనులకు గతంలోనే ప్రభుత్వం దాదాపు రూ.వంద కోట్లకుపైగా నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రామన్నగూడెం వద్ద జియో ట్యూబ్స్ తరహాలో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచించారు.కాగా ఇటీవల వరదల నేపథ్యంలో పనులు నిలిచిపోగా, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద కరకట్ట కొద్దికొద్దిగా కోతకు గురవుతోంది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. స్థానికులు సమస్యను ఇరిగేషన్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లడంతో ఆదివారం యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు.కరకట్ట కోతకు గురవకుండా మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే గోదావరిలో నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. జాకారం, గట్టమ్మ ఆలయం మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.వర్షంలోనే లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ఆఫీసర్లకు తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజల రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవ్వరూ రావద్దని సూచించారు. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్లకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

Related Posts