YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పెద్దవాగు ప్రాజెక్టు గండికి అసలు కారకులెవరు

పెద్దవాగు ప్రాజెక్టు గండికి అసలు కారకులెవరు

ఖమ్మం, జూలై 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు గండికి అసలు కారకులెవరు.? రెండు తెలుగు రాష్ట్రాల నడుమ ఉన్న ఈ ప్రాజెక్టుకు భారీ గండి పడి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడానికి బాధ్యులెవరు.? ఈ గండి పడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్షమే కారణమా.? లేక తెలంగాణ ప్రభుత్వ ఏమరుపాటు కారణమా..? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఇరు రాష్ట్రాల ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి.ఈ ప్రాజెక్టుకు పడిన భారీ గండితో రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1975వ సంవత్సరంలో ఈ మధ్యతరహా ప్రాజెక్టును నాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు తెలంగాణలో మిగిలిపోగా దీని కింద సాగయ్యే ఆయకట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఇరు రాష్ట్రాలతో అనుబంధం ఏర్పడింది.తాజాగా భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల సామర్థ్యం, క్రస్ట్ గేట్ల పని తీరుపై రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెద్ద వాగు ప్రాజెక్టుకు గండి పడిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్లు ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈలు క్షేత్ర స్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నలుగురు అధికారులను బాధ్యులను చేస్తూ వారికి మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది.పెద్దవాగు ప్రాజెక్టుకు గండి కారణంగా సుమారు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. గండి కారణంగా వరద పోటెత్తి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఊళ్లకు ఊళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. కాగా పెద్ద వాగు ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలనకు రానున్నాయి.పెద్దవాగు ప్రాజెక్ట్ 1975లో ప్రారంభమై 1981 లో నిర్మాణం పూర్తి చేసుకుందని మంత్రుల తుమ్మల తెలిపారు. రాష్ట్ర విభజన తో ప్రాజెక్ట్ తెలంగాణలో, ఆయకట్టు ఆంధ్రాలో ఉందన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ కట్ట కోతకు గురైందని చెప్పారు.“గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో 31 సెంటి మీటర్ల భారీ వర్షం వల్ల 80 వేల క్యూసెక్కుల వరద నీరు పోటేత్తడంతో కట్ట మూడు చోట్ల గండ్లు పడి వరద నీరు సమీపంలోని గుమ్మడివల్లి, కొత్తూరు, నారాయణపురం గ్రామాలతో పాటు వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలను ముంచెత్తింది. తెలంగాణ ప్రాంతంలో పంట నష్టపోయిన రైతులని ఆదుకోవటానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో ఉన్నారు” అని తుమ్మల చెప్పారు.“ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో గతంలో 1989 లో ఈ ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది. మళ్ళీ 35 ఏళ్ల తరువాత భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాజెక్ట్ ఆనకట్ట తెగింది. వరదలో చిక్కిన 30 మందిని ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని కాపాడాం ” అని వెల్లడించారు."భారీ వర్షాలు, వరదల వల్ల గండి పడ్డ పెద్దవాగు ప్రాజెక్ట్ స్థితిగతులు, నష్టపోయిన రైతుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కి వివరించాం. పెద్దవాగు వరద బీభత్సం వల్ల నష్టపోయిన రైతాంగం వివరాలు సేకరించాల్సిందిగా సీఎం రేవంత్ సూచన చేశారు.ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా పంట నష్టపోయిన రైతులు వివరాలు సేకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించాం. నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ఇన్పుట్ సబ్సిడీ అందజేతపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆస్తి నష్టం జరిగిన వారికి, పంట నష్టం జరిగిన రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం ఇరు రాష్ట్రల అధికారులు సమావేశం నిర్వహించి తగిన కార్యచరణ చేస్తాం." అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Related Posts