YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ కు ఆర్ధిక సవాళ్లు...

రేవంత్ కు ఆర్ధిక సవాళ్లు...

హైదరాబాద్,జూలై 24,
ఎన్నికల హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో… కొన్ని పథకాలను వాయిదా వేసిన ప్రభుత్వం. ఆగస్టు 15 తర్వాత ఆ పథకాలను ఎలా ముందుకు తీసుకువెళుతుందన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. రైతు రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీ పథకాలకు నిధుల సమీకరణే రేవంత్‌ సర్కార్‌కు కత్తిమీద సాములా తయారైందా? ఆగస్టు 15 తర్వాత ఏం చేస్తుంది?రుణామాఫీ చేసి తీరతా… అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి తన మాట నిలబెట్టుకుంటున్నారు. తొలి దశలో లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణ విముక్తి చేశారు. ఇందుకోసం సుమారు 6 వేల కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ మొత్తం సమీకరించేందుకు తాత్కాలికంగా రైతు భరోసా సాయాన్ని వాయిదా వేసింది సర్కారు. ఏదో విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్న సర్కారు… రుణ మాఫీతో అన్నదాతల్లో ఆశలు నింపింది. ఇక మిగిలిన 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు మరో 25 వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం.ఏకకాలంలో 31 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం… నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియను ప్రారంభించడంతో హర్షం వ్యక్తమవుతోంది. రుణమాఫీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం… అవేవీ కొలిక్కి రాకపోయినా అందుబాటులో ఉన్న నిధులతో తొలి విడతలో 11 లక్షల మందికి లబ్ధి చేకూర్చి ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌ చెప్పింది. ఐతే ఇప్పుడు మిగిలిన రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.రైతు రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు రకరకాల మార్గాలను అన్వేషించింది. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను విక్రయించడంతోపాటు ఈఎంఐ పద్ధతిలో రుణాలు తీసుకోవడం, బకాయిలను వసూలు చేయడం, కేంద్రం నుంచి అదనపు నిధులు సేకరించడం వంటి రకరకరాల ప్రయత్నాలు చేస్తోంది. ఇవేవీ కొలిక్కిరాకపోయినా, రైతు భరోసా కోసం ఉంచిన నిధులతో తొలివిడత రుణమాఫీని చేసి ఎన్నికల హామీని నెరవేర్చుకుంది. ఐతే ఇప్పుడు కేంద్రం నిధులు, అదనపు రుణాలు వస్తే కాని మిగిలిన రైతులకు రుణమాఫీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ప్రభుత్వం మిగిలిన రైతులకు రుణమాఫీ చేసేలా అవసరమైన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసిందనే అంటున్నారు. వచ్చే నెల తొలి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నందున ఆలోగానే మొత్తం రైతు రుణమాఫీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాకపోతే.. మిగిలిన పథకాలకు నిధులు సర్దుబాటు చేయడమే ప్రభుత్వానికి ఇప్పుడు సవాల్‌గా మారింది. 7నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ… ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలపై హామీలిచ్చింది. ఇందులో రెండు పథకాలు ఇప్పటికే అమలు అవుతున్నాయి. రైతు రుణమాఫీ కూడా అమలులోకి వచ్చింది. ఇక మిగిలిన గ్యారెంటీలతోపాటు ఇతర ఎన్నికల హామీలు, ఇప్పటికే అమలు అవుతున్న పథకాలకు నిధులు ఎలా సమీకరిస్తారనేదే ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ, ప్రభుత్వం దశలవారీగా అన్ని పథకాలను అమలు చేస్తామనే చెబుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది. తొలి ఆరు నెలలు కొత్త ప్రభుత్వానికి అవకాశమివ్వాలని ప్రతిపక్షాలు వేచిచూశాయి. ఇప్పుడు ఆ హనీమూన్‌ పీరియడ్‌ ముగిసినందున ప్రభుత్వంపై పోరాటాలు ప్రారంభించాయి. దీంతో మున్ముందు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం… మున్ముందు రాష్ట్ర అర్థిక పరిస్థితులతోపాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి వుంటుంది. ఈ పరిస్థితులను ఎలా అధిగమిస్తుంది.. ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఎలా అడుగులు వేస్తుంది… ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోడానికి ఎలాంటి ఎత్తుగడలను అమలు చేయనుందనేదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఏదైనా రైతు రుణమాఫీకి ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా పెట్టుకున్న సీఎం.. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు వాట్‌ నెక్ట్స్‌ అనే ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువు అయ్యారు.

Related Posts