విజయవాడ, జూలై 23
ఏపీలో ప్రస్తుతం హత్యారాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో ఎన్ని హత్యలు జరిగాయో కీలక సమాచారాన్ని పోలీస్ శాఖ వెల్లడించింది. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటావిక పాలన మొదలైందని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎంపీ మిధున్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇప్పటి వరకూ 31 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. దీనిని పార్లమెంటులో ఎండగడతామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని రాజంపేట నియోజకవర్గం ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై గణాంకాలతో సహా స్పందించింది పోలీస్ శాఖ. ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని కీలక విషయాలను వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని స్పష్టం చేసింది. ఒకరు వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ వివరించింది. ఇవి కాకుండా పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది. అటు వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ధీటుగా ఏపీ పోలీస్ శాఖ స్పందించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందిం. అయితే మాజీ ముఖ్యమంత్రి ఈ హత్యలకు సంబంధించి నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. జూలై 24, బుధవారం ఢిల్లీలో నిరాహార దీక్షతోపాటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు. ఈ కార్యక్రమంలో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని కూడా గతంలో వైఎస్ జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలో అటు పోలీసు శాఖ వెల్లడించిన సమాచారంతో వైసీపీ ఏకీభవిస్తుందా.. లేదా అన్నది వేచి చూడాలి.