YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీఎం, డిప్యూటీ సీఎం మధ్య గ్యాప్...?

 సీఎం, డిప్యూటీ సీఎం మధ్య గ్యాప్...?

హైదరాబాద్, జూలై 24,
తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసిన రామకృష్ణారావు… ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌లోనూ అదే హోదాలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులను ప్రాధాన్యం లేని ఇతర శాఖలకు బదిలీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. పదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన చేసిన అరుదైన రికార్డు ఉన్న రామకృష్ణారావును మాత్రం కదపలేదు. అయితే ఇదే విషయంపై సచివాలయ వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉండేది.అయితే రామకృష్ణారావును బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావించినా, డిప్యూటీ సీఎం కమ్ ఫైనాన్స్‌ మినిస్టర్‌ భట్టి విక్రమార్క వద్దని చెప్పారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్ధిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ క్లియరయ్యే వరకు ఆయననే ఆర్ధిక శాఖ సెక్రెటరీగా కొనసాగించాలని భట్టి కోరినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రామకృష్ణారావు అధికారాలకు కత్తెర వేసినట్లు చెబుతున్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని 9 విభాగాలను ఒక సీనియర్ అధికారికి, మరో 13 విభాగాలను మరో సీనియర్ అధికారికి కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో పెను మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. అయితే పని భారం పెరిగిపోవడం వల్లే రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు చెబుతోంది ప్రభుత్వం. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంత సీరియస్ అయ్యారని అంటున్నారు. తను బదిలీ చేయొద్దన్న అధికారి రామకృష్ణారావు అధికారాల్లో కోత పెట్టడమేంటని డిప్యూటీ సీఎం భట్టి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐతే ఇందుకు సంబంధించిన కారణాలను సీఎం రేవంత్ రెడ్డి తరపున సీఎస్ శాంతికుమారి వివరించారని అంటున్నారు.గత కొంత కాలంగా ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే రామకృష్ణారావుకు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కొన్ని విభాగాలను సీనియర్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానీయా, కృష్ణ భాస్కర్‌కు అప్పగించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారట సీఎస్ శాంతి కుమారి. అయినప్పటికీ రామకృష్ణారావు వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భట్టి కొంత సీరియస్‌గా ఉన్నారని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts