YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతికి కేంద్రం ఊపిరి

అమరావతికి కేంద్రం ఊపిరి

విజయవాడ, జూలై 24
అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోసింది. అలా ఇలా కాదు ఏకంగా పది హేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని .. అదీ కూడా ఈ ఒక్క ఏడాదిలోనే అని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక  అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఖజానాలో రుపాయి రుపాయి కూడబెట్టుకుంటున్న పరిస్థితుల్లో రాజధాని లేని రాష్ట్రంలో నిర్మాణ పనుల కోసం రూ.15వేల కోట్ల రుపాయలను కేటాయించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి వరంగా మారనుంది. ఈ నిధులు గ్రాంటుగా కేటాయించి ఏపీకి మరింత ప్రయోజనం చేకూరి ఉండేది. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణంపై అపనమ్మకంతో ఉన్న పెట్టుబడిదారులకు కేంద్రం ప్రకటన గొప్ప భరోసాను కల్పిస్తుంది.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోడానికి కూడా వెండర్లు ఆసక్తి చూపడం లేదు.2014-19మధ్య జరిగిన ఒప్పందాలకు చెల్లింపులు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు, ప్రభుత్వంతో లావాదేవీలు జరిపే కార్పొరేట్ వెండర్లు ఏపీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే భరోసా ఇస్తుండటంతో వారిలో నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ-గుంటూరు నగరాల మధ్య 2015లో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. 33వేల ఎకరాల విస్తీర్ణంలో రైతుల నుంచి భూములు సమీకరించి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడాదిలోపే ఏపీ సచివాలయ కార్యకలాపాలను వెలగపూడి నుంచి ప్రారంభించారు. 2019వరకు అమరావతి నిర్మాణం వేగంగా జరిగింది. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. 2019లో ప్రభుత్వం మారే సమయానికి దాదాపు రూ.10వేల కోట్ల రుపాయల బిల్లుల్ని చెల్లించాల్సి ఉంది.గత ఐదేళ్లలో రాజధానిలో నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు తిరిగి ప్రారంభించాలని భావించినా నిధుల సమస్య అందరిని భయపెట్టింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల్లో కనీసం సగమైనా చెల్లిస్తే తప్ప పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితులు లేవు.కేంద్రం ఆదుకుంటే తప్ప రాజధాని నిర్మాణం గట్టెక్కే పరిస్థితులు లేవు. కేంద్ర బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్‌ చేసిన ప్రకటనతో అమరావతి ఊపిరి పోసుకున్నట్టు అయ్యింది. రూ.15వేల కోట్ల రుపాయలను వివిధ ఏజెన్సీల ద్వారా ఏపీకి అందించేందుకు కేంద్రం హామీ కల్పించనుంది. అమరావతి కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని నిధులకు సాయం చేస్తామని కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.అమరావతి నిర్మాణంలో భాగంగా పలు శాశ్వత నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయి. ఫినిషింగ్ పనులు పూర్తి చేస్తే అవి వినియోగంలో వస్తాయి. ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్లు, జడ్జిల క్వార్టర్లు వివిధ దశల్లో ఉన్నాయి. సెక్రటేరియట్ భవనం పునాదుల్లోనే ఆగిపోయింది. ఉద్దండరాయుని పాలెం నుంచి నిడమర్రు వరకు ఐదు కిలోమీటర్ల పొడవున ఏపీ ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం నిధులకు హామీ ఇవ్వడంతో వీటి నిర్మాణం తిరిగి త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు టెండర్లు పిలిచారు.ఆగిపోయిన నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు పుంజుకోనున్నాయి. పరిపాలనా నగరానికి ఓ రూపు రావడానికి రాష్ట్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సాయం అందనుంది. అదే సమయంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరగనున్నాయి. దీంతో అమరావతి ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. 2014లో రాజధాని లేకుండా ఏపీ ఏర్పాటయింది. ఎన్నికల ప్రచారంలో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చాయి. స్వయంగా ప్రధాని మోదీ ఇలాంటి ప్రకటన చేశారు. కారణం ఏదైనా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అనుకున్నంత సాయం రాలేదు. ఏపీ రాజధాని అమరావతి ప్రణాళికలు మోదీ సహకరించారు కానీ నిధుల విషయంలో మాత్రం అనుకున్నంత సపోర్టు రాలేదు. కేంద్రపట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చొరవతో రెండున్నర వేల కోట్లు మంజూరయ్యాయి కానీ.. అందులో వెయ్యి కోట్లు పెండింగ్ లో పడిపోయాయి. ఆ తర్వాత అమరావతికి ఎలాంటి సాయం అందలేదు. కానీ ఇప్పుడు ఏకంగా పదిహేను వేల కోట్ల సాయం ప్రకటించారు. చంద్రబాబు మొదటి సారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అమరావతిని రాజధానిగా ఖరారు చేసి.. భూసమీకరణ చేసి , ఎన్జీటీలో పడిన కేసుల్ని పరిష్కరించుకుని నిర్మాణాలు ప్రారంభించే సరికి మూడున్నరేళ్లు దాటిపోయింది. ఏడాదిన్నరలోనే వీలైనంత ఎక్కువ ప్రోగ్రెస్ చూపించారు . కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతిని పక్కన పెట్టేయడంతో పరిస్థితి మారిపోయింది. ఐదేళ్ల పాటు అమరావతి పిచ్చి మొక్కల ప్రాంతంగా మారిపోయింది. కానీ  ప్రభుత్వం మారడం.. కేంద్రం ఏపీ రాజధానికి పదిహేను వేల కోట్ల సాయం  ప్రటించడంతో ఇక నిర్మాణాలు పరుగులు పెట్టనున్నాయి.  ప్రభుత్వ నిర్మాలతో పాటు ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున విద్యా సంస్థలు.. ఏర్పాటు చేయనున్నాయి. అలాగే ప్రముఖ కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నాయి. ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం పెరిగితే ఇక అమరావతి ఐదేళ్లలో ఓ భారీ సిటీగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందు ఇప్పుడు ఉన్న అతి పెద్ద సవాల్ పరిపాలనా నగరం పూర్తి చేయడమే. పరిపాలనా నగరాన్ని పూర్తి చేయడానికి ఇప్పటి వరకూ నిధుల సమస్య ఉంది. కేంద్రం పదిహేను వేల కోట్లు వివిధ సంస్థల ద్వారా సమకూర్చడం ఖాయం కాబట్టి.. వెంటనే పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలతో ఐకానిక్ భవనాల నిర్మాణాలు.. ఉద్యోగులకు వసతి సౌకర్యాలు పూర్తి చేస్తే.. అమరావతి ఓ రూపానికి వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్న ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నం కాదు. స్టాండప్ కామెడీలకు ఏపీ రాజధాని ఓ పాయింట్ కూడా కాదు. ఇప్పుడు అందరికీ ఏపీ రాజధాని అమరావతి అనే స్పష్టత వచ్చేసింది.

Related Posts