YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిప్పుల్లో నిజాలు...

నిప్పుల్లో నిజాలు...

తిరుపతి, జూలై 23,
మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో చెలరేగిన మంటలు… రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. ఓ వైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు పూనుకున్న ప్రభుత్వం… శ్వేతాస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతుండగా, మదనపల్లెలో కీలక ఫైళ్లు కాలిపోయాయనే సమాచారం ప్రభుత్వాన్ని అలెర్ట్‌ చేసింది. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన 980 ఎకరాల అనాధీన భూములు పట్టా భూములుగా మారిన వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుండగా, ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ప్రభుత్వానికి షాకిచ్చినట్లైందంటున్నారు. అధికారంలోకి వచ్చి 40 రోజుల తర్వాత కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం…. అదీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే అవ్వడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై ఉన్నతాధికారులను పంపాల్సి వచ్చింది.మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా కొత్తగా నియమితులైన అధికారి మేఘ స్వరూప్‌ బాధ్యతలు తీసుకోడానికి కొన్ని గంటల ముందు… మంటలు చెలరేగడమే సందేహాలకు తావిస్తోంది. సెలవు రోజున… ఓ ప్రభుత్వ ఉద్యోగి అర్ధరాత్రి వరకు కార్యాలయంలో ఉండటం… అతడు వెళ్లిన కొద్ది సేపటికి కార్యాలయం బుగ్గి పాలవడం…. అందునా అతుడు వైసీపీ కీలక నేతకు పట్టున ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఎన్నెన్నో అనుమానాలకు తావిస్తోంది…. ఈ ప్రమాదం ఒక్కటే కాదు గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఫైళ్ల దహనమవుతూనే ఉన్నాయి. ఈ చర్యల వెనుక ఏమైనా కుట్ర ఉందా? అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది.ఇప్పుడు మదనపల్లె… కొద్దిరోజుల ముందు విజయవాడలోని కాలుష్యనియంత్రణ మండలి ఫైళ్లు… అంతకు కొద్దిరోజుల క్రితం నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయంలో ఫైళ్లు కాలిపోయాయి. ఇక ఎన్నికల ఫలితాలకు ముందు తాడేపల్లిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫైళ్లు కాల్చివేశారు.అమరావతి ఔటర్‌, ఇన్నర్‌రింగ్‌ కేసులో హెరిటేజ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్లు గుట్టుగా కాల్చివేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇక ఇప్పుడు మదనపల్లెలో కూడా విలువైన భూములను ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేత దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల పాత్రపైనా ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇలాంటి సమయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగడమే అనేక అనుమానాలకు దారితీస్తోంది.మదనపల్లె వ్యవహారంలో అనుమానాలు ఎదుర్కొంటున్న నేత గత ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. రాయలసీమలో ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ నేత కుటుంబ సభ్యులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లే కాలిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ప్రమాదాలపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగుతున్నాయా? పథకం ప్రకారం నిప్పు రాజేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.ఒక్క మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో చెలరేగిన అగ్ని కీలలే కాదు… గతంలో విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్లు కాల్చివేత కూడా అనేక సందేహాలకు దారితీసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన సీఐడీ పలువురు పాత్రధారులను అరెస్టు చేసింది. సూత్రధారుల కోసం కూపీ లాగుతోంది…. ఇదే క్రమంలో మరో ప్రభుత్వ కార్యాలయంలో మంటల చలరేగడమే ప్రభుత్వానికి చాలెంజింగ్‌గా మారింది.రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు… ఫైళ్లు కాల్చివేత ఓవైపు కొనసాగుతుండగా, ఇదే సమయంలో కొన్ని కీలక ఫైళ్లు అదృశ్యమయ్యాయనే సమాచారం ప్రభుత్వం సేకరించిందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్‌ చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్‌ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తుండటం వల్ల… ఏకంగా కీలక సమాచారం ఉన్న కాగితాలను కాల్చేయాలనే నిర్ణయానికి వచ్చారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్ని కీలలు రాష్ట్రంలో కలకలం రేపాయి.ఎన్నడూ లేనట్లు… సమాచారం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి నిమిష.. నిమిషానికి ఏం జరిగిందో తెలుసుకోవడం చూస్తే…. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లే కనిపిస్తోందంటున్నారు. ఇక డీజీపీ ద్వారకా తిరుమలరావును హుటాహుటిన మదనపల్లె పంపడం కూడా ప్రభుత్వం గట్టి యాక్షన్‌ తీసుకునే అవకాశాలున్నాయనే సంకేతాలు పంపుతోందంటున్నారు. మొత్తానికి మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ కేంద్రంగా రేగిన కాక… రాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపునకు దారితీసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Related Posts