విజయవాడ, జూలై 25
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హోదా యోధునిగా మారారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం యోధునిగా మారిన అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడుతున్నారు. మొదట తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని ఆయన అనుకున్నారు. కానీ అలా చేయకపోవడంతో స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ పట్టించుకోలేదు. మంగళవారం జరిగిన సభలో వైఎస్ఆర్‌సీపీ పక్ష నేతగానే జగన్ మోహన్ రెడ్డిని గుర్తిస్తూ ప్రకటన చేశారు. దీంతో జగన్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలియగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శాసన వ్యవస్థను న్యాయవ్యవస్థ ఆదేశించలేదు. ముఖ్యంగా శాసనసభా వ్యవహారాల్లో స్పీకర్ పాత్రే అత్యున్నతం. స్పీకర్ సభా నిర్వహణ విషయంలో ఫలానా పని చేయాలని న్యాయవ్యవస్థ ఆదేశించలేదు. అందుకే ఇలాంటి అంశాల్లో దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టులు సూచనలు మాత్రమే చేస్తాయి. వాటిని అమలు చేస్తారా లేదా అన్నది స్పీకర్ ఇష్టం. అయితే ఇలాంటి సూచనలు ..ఫిరాయింపు నిరోధక చట్టం విషయంలో దాఖలైన పిటిషన్లపైనే ఇప్పటి వరకూ కోర్టులు చేశాయి. ఫలానా నేతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఎప్పుడూ కోర్టులు సూచనలు కూడా చేయలేదు. ఈ విషయం జగన్‌కు తెలియనిదేం కాదు.. ఆయనకు తెలియకపోయినా ఆయన సలహాదారులకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా కోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందని తెలిసి కూడా జగన్ పిటిషన్ వేశారని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ప్రధాన ప్రతిపక్ష నేత అర్హత కూడా సాధించలేకపోయింది. పది శాతం సీట్లు సాధిస్తేనే.. ప్రతిపక్ష నేత హోదా వస్తుందని ఇప్పటి వరకూ అనేక సార్లు రుజువు అయింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడం .. సుప్రీంకోర్టుకు వెళ్లినా సానుకూల ఫలితం రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడ ఓ చాయిస్ ఉంది. అది స్పీకర్ చేతుల్లో ఉంది. ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకి ఇవ్వాలనుకుకంటే స్పీకర్ ఇవ్వొచ్చు. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షం ఎన్ని సీట్లు గెలిచినా సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఇవ్వొచ్చు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం ఒక్క వైసీపీనే. స్పీకర్ అనుకుంటే ఇస్తారు. కానీ జగన్‌కు అలాంటి అవకాశం ఇవ్వకూడదని..ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని టీడీపీ గట్టిగా అనుకుంటోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు, వ్యక్తిగత శత్రువులు వేర్వేరు కాదు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఆయన వ్యక్తిగత శత్రువులుగానే చూస్తారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు పడిన ఇబ్బందులు.. అసెంబ్లీలో వారు ఎదుర్కొన్న అవమానాలు మరే సభలోనూ విపక్ష సభ్యులు ఎదుర్కొని ఉండరు. చివరికి చంద్రబాబునాయుడు కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆయనకు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష నేత హోదా ను కల్పిస్తే.. అంత కంటే తప్పిదం ఉండదని అనుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆయన వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉంటారు. పార్టీ బలం ప్రకారం మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ ప్రతిపక్ష నేత హోదా మాత్రం రాదు. కోర్టులకు వెళ్లినా రాదు.. ఇదంతా తెలిసి జగన్ పోరాటం చేస్తున్నారు. అన్నీ తెలిసీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే జగన్ వ్యూహాలు జగన్ కు ఉన్నాయని రాజకీయ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. 40 శాతం ఓట్లు వచ్చినా తనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వడం లేదన్న సానుభూతి కోసమే.. ఈ అంశాన్ని ఎక్కువ కాలం ప్రజల్లో ఉంచాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. తనను వేధిస్తున్నారని సానుభూతి సంపాదించేందుకు ఈ అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.