గన్నవరం
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీ మార్గాని భారత్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేసాం. అఖిలేష్ యాదవ్ తోపాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు.
త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని అన్నారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయిందని అన్నారు.