బద్వేలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో మోడీ అనుసరించే మైనారిటీ వ్యతిరేక విధానాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని మైనార్టీల బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రాకపోవడం
చేతకాని తనమేనని ఆయన అన్నారు. కేవలం రాజధాని నిధులు ఇచ్చారని సంకలు గుద్దుకోవడమే తప్ప రాష్ట్రంలో మైనార్టీ వర్గాలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతుంటే మైనార్టీ మంత్రి గాని సంబంధిత అధికారి గాని కేంద్ర బడ్జెట్ పై నోరు విప్పక పోవటం బాధాకరమన్నారు.
మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వర్గాలకు బడ్జెట్‌లో ప్రధాన శాఖలోని పెద్ద ఎత్తున పోతుల విధించారని ఆయన అన్నారు. ముఖ్యంగా అనేక స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి పథకాలు నిధులలో కోత విధించారని,తాజా బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులు మైనారిటీలు అధికంగా ఉండే దాదాపు 1,300 ప్రాంతాలలో అభివృద్ధి లోటును పూడ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (పీఎంజేవీకే)కు జరిగిన కేటాయింపులేనని
తాజా బడ్జెట్‌లో ఈ శాఖకు కేటాయింపులు పెంచినట్లు ప్రభుత్వం చెప్పుకుంటుందని ఆయన అన్నారు,అది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన పీఎంజేవీకేకు కేంద్రం బడ్జెట్‌లో రూ. 300 కోట్ల మేర సహాయం అందించినందున కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకు జరిపిన కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదలకు కారణమైందని వారు వివరించారు.
కొత్త ఎన్డీఏ ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో, కేంద్ర రంగ పథకాల కింద, కేవలం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ మాత్రమే రూ.1,065 కోట్ల నుంచి రూ.1,145 కోట్లకు పెరిగింది. నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పథకాలు గతేడాది మంజూరు చేసిన రూ.64.4 కోట్లతో పోలిస్తే కేవలం రూ.3 కోట్లకు తగ్గాయి. నేషనల్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎన్ఎమ్‌డీఎఫ్‌సీ)కి చివరిసారిగా రూ.61 కోట్లు మంజూరు చేయగా.. ఈ సారి ఎటువంటి మొత్తాన్నీ కేటాయించకపోవటం గమనార్హం. మొత్తం విద్యా సాధికారత రూ.1,689 కోట్ల నుంచి 1,575 కోట్లకు తగ్గింది. ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం గతేడాది కేటాయించిన రూ.433 కోట్లతో పోలిస్తే రూ.326.2 కోట్లకు తగ్గింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌కు గతేడాది రూ.96 కోట్ల ఇస్తే.. ఈ సారి రూ.45 కోట్లు కేటాయించారు. ఉచిత కోచింగ్, అనుబంధ పథకాలకు గతసారి కేటాయించిన రూ.30 కోట్లతో పోలిస్తే కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. విదేశీ చదువుల కోసం విద్యా రుణాలపై వడ్డీ రాయితీని రూ.21 కోట్ల నుంచి రూ.15.3 కోట్లకు తగ్గించింది అని ఆయన వాపోయారు.
2014లో మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్‌తో పోలిస్తే గతేడాది బడ్జెట్‌లో మంత్రిత్వ శాఖ కేటాయింపులు 17 శాతం తగ్గాయి. మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవటానికి తీసుకున్న విద్యా రుణాలపై వడ్డీ రాయితీలు మంజూరు చేసే పధో పరదేశ్ పథకం రద్దు చేయబడిన కేంద్ర రంగ పథకాలలో ఒకటి. విద్యార్థులకు నెలకు రూ.1,000 వరకు అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ 1 నుండి 8 తరగతులకు రద్దు చేయబడింది అని ఆయన అన్నారు. కాగా, మోడీ ప్రభుత్వం ఎప్పటిలాగే తమ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని మైనారిటీ వర్గాలు ఎటు చూసినా అన్యాయమే చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల పక్కన నిలబడి పోరాటం చేసి కోత విధించిన బడ్జెట్ను పెంచే విధంగా చూడాలని ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళన చేయవలసి వస్తుందని తెలియజేశారు