విజయవాడ, జూలై 26,
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ అంశాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా శాసనమండలితో పాటు రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యత ఉంది. మరోవైపు స్థానిక సంస్థల్లో కూడా వైసిపి ప్రాతినిధ్యం ఉంది. దీనిని ఎలాగైనా అధిగమించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.స్థా నిక సంస్థలకు సంబంధించి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల కాలం అనివార్యం. అప్పట్లో దీనిపై జగన్ సర్కార్ చట్టం చేసింది. ఇప్పుడు స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలంటే చట్ట సవరణ చేయాలి. అందుకే కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. చట్ట సవరణకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో స్విప్ చేసింది. కార్పొరేషన్ లో తోపాటు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఒక తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప.. మిగతావన్నీ వైసిపి ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైంది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ నగరపాలక సంస్థతో పాటు చాలా కార్పొరేషన్లలో కార్పొరేటర్లు టిడిపి తో పాటు జనసేనలో చేరారు. పుంగనూరు, చిత్తూరు వంటి చోట్ల కౌన్సిలర్లు సైతం పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రతినిధులు ఎక్కువమంది కూటమి పార్టీలో చేరారు. అక్కడ అధ్యక్ష స్థానాలు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం పెట్టాలి. కానీ అందుకు మరో రెండేళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. అందుకే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చట్ట సవరణ చేయాలని భావిస్తోంది. అది జరిగితే రాష్ట్రంలోని చాలా వరకు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తులు టిడిపి చేతిలోకి వస్తాయిమున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించి గ్రేటర్ విశాఖ టిడిపి కూటమి వశమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు టిడిపి, జనసేనలో చేరారు. ఏడుగురు టిడిపిలో చేరగా, మరో అయిదుగురు జనసేనలో చేరారు. దీంతో కూటమి బలం పెరిగింది. గ్రేటర్ విశాఖలో 98 కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి. వైసీపీకి 58, టిడిపికి 29 మంది సభ్యుల బలం ఉంది. జనసేన మూడు చోట్ల గెలిచింది. బిజెపి, సిపిఎం, సిపిఐ ఒక్కోచోట గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్ లు గెలిచారు. అయితే గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపి స్థానాలను కూటమి ఏకపక్షంగా గెలుచుకుంది. ఇప్పుడు చేరిన 12 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీ,ఎమ్మెల్యేల ఓట్లతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.వైసీపీ హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా తలపడింది. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో వైసిపి విధ్వంస ఘటనలకు తెరతీసింది. అప్పట్లో బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంది. దీంతో టీడీపీకి ఓటమి ఎదురైంది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. దీంతో తరువాత వచ్చిన ప్రాదేశిక ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. దీంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని మండలాలు, జిల్లా పరిషత్తులను వైసిపి కైవసం చేసుకుంది. అవిశ్వాస తీర్మానం నాలుగేళ్లు పూర్తయితే కానీ పెట్టలేని విధంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక్క జిల్లా పరిషత్ సైతం చేతిలో లేదు. మెజారిటీ మండల పరిషత్తులు సైతం వైసీపీ చేతిలోనే ఉన్నాయి. దీంతో పాలనతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికలకు ముందే కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు ఎన్నికల తరువాత కూడా చాలామంది పార్టీల్లో చేరుతున్నారు. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి శ్రేణులకు ఇబ్బంది పెట్టని వారికి మాత్రమే పార్టీలోకి తీసుకుంటున్నారు. జనసేన సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. అయితే శాసనసభలో చట్ట సవరణ చేసి.. స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం చేయాలని టిడిపి తో పాటు జనసేన నిర్ణయం తీసుకున్నాయి.