నెల్లూరు, జూలై 26,
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంల పనితీరు, వాటిని హ్యాకింగ్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చన్న బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఈవీఎంలను నిషేధించాయి. బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మనదేశంలో కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడానికి ఈవీఎంల హ్యాకింగ్ కారణమని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 175 స్థానాలకు గాను 164 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం ఒంటరిగా 135 స్థానాలు విజయం సాధించింది. 21 చోట్ల జనసేన, 8 చోట్ల బిజెపి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. హేమహేమీలు, బలమైన నియోజకవర్గాలను సైతం వదులుకోవాల్సి వచ్చింది.అప్పుడే మరోసారి ఈవీఎంల హ్యాకింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రజలు తిరస్కరించాలంటే అనుమానంగా ఉందని జగన్ కామెంట్స్ చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రెడ్డి అయితే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హ్యాకింగ్ చేశారని తేల్చేశారు. దాదాపు వైసీపీ నేతలంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చింది టిడిపి. 2019లో వైసీపీకి 151 స్థానాలు లభించాయి.అప్పుడు కూడా ఈవీఎంలను హ్యాకింగ్ చేశారా అంటూ ప్రశ్నించింది టిడిపి. దీంతో సోషల్ మీడియాలో ఇదో ఆసక్తికర అంశంగా మారింది.తెలుగు సినిమా రంగంలో ఏవీఎం ప్రొడక్షన్స్ కు మంచి పేరు ఉంది. తాజాగా ఈవీఎం ప్రొడక్షన్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తున్నాయి.అందులో సైకిల్ గుర్తు వేసి.. ఈవీఎంల హ్యాకింగ్ ద్వారా టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది అంటూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటుంది. టిడిపి అనుకూల మీడియాలో డిబేట్లను అందులో పొందుపరిచారు. సంపూర్ణ విజయం ఎలా దక్కిందని ప్రజలు తనను అడుగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం జత చేశారు. ఆ విజయం పై పవన్ కే నమ్మకం లేదన్నట్టు వీడియో దృశ్యాలను అందులో పొందుపరిచారు. అయితే అందులో విశేషమేమిటంటే..అవన్నీ 2019 ఎన్నికల ఫలితాల సమయంలో టిడిపి శ్రేణులు, అనుకూలమైన వారు ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానం వ్యక్తం చేసిన వీడియోలతో దానిని రూపొందించడం విశేషం.వాస్తవానికి ఈవీఎంల టెంపరింగ్ ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా టిడిపి గళమెత్తిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జాతీయస్థాయిలో బిజెపికి బంపర్ మెజారిటీ వచ్చింది. ఏపీలో వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో సైతం చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు ట్యాంపరింగ్ చేసిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు.2024 ఎన్నికల్లో బిజెపికి బలం తగ్గింది. కానీ పెద్ద పార్టీగా అవతరించింది. ఏపీలో సైతం కూటమి బంపర్ మెజారిటీ సాధించింది. ఎక్కడైతే బిజెపి గెలిచిందో.. అటువంటి చోట ట్యాంపరింగ్ జరిగిందన్న కామెంట్స్ వినిపించాయి. ఎక్కడైతే విపక్షాలు గెలిచాయో ఆ మాట వినిపించలేదు. ఏపీలో బిజెపితో కలిసి నడిచిన కూటమి భారీ మెజారిటీ సాధించింది. అందుకే వైసిపికి ఇదో ప్రచార అస్త్రంగా మారింది. కానీ ప్రజల్లో మాత్రం ఒక రకమైన అభిప్రాయం నెలకొంది. ఓడిపోతే ఈవీఎంలపై ట్యాంపరింగ్ అనుమానం.. గెలిస్తే ప్రజలపై తమ నమ్మకం అన్నట్టు పార్టీలు వ్యవహరిస్తాయని ప్రజలు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు.