YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హీట్ పుట్టిస్తున్న ఎంక్వయిరీలు

హీట్ పుట్టిస్తున్న ఎంక్వయిరీలు

విజయవాడ, జూలై 26,
ఏపీ గట్టుపై ఇప్పుడు ఎంక్వైరీల టైమ్‌ హీట్ పుట్టిస్తోంది.
ప్రభుత్వం మారింది.. మంత్రులంతా రివ్యూలతో ఆఫీస్‌లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో కృష్ణాజిల్లా యనమలకుదురు కట్టపై ప్రభుత్వ రికార్డులు తగలబెట్టిన ఘటన సంచలనం రేపింది. స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కొంతమందిని పోలీసులకు అప్పగించారు. పీసీబీ, మైనింగ్‌ ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. ఉన్నపళంగా కట్టపై ఎందుకిలా చేశారన్నది అంతుబట్టలేదు.యనమలకుదురు కట్టపై ఫైళ్ల దగ్ధం ఘటన మరువకముందే.. మదనపల్లి సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. రాత్రి పదకొండున్నర గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ కాలిపోయాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆర్డీవో హరి ప్రసాద్‌తో పాటు 37 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాల్‌డేటాపైనా ఆరాతీశారు. చుక్కల భూములు, 22ఏ ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్‌కి సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నది తేల్చే పనిలో పడ్డారు. సెలవు రోజున ఎవరి ప్రమేయంతో.. ఎందుకిలా చేశారన్నది మిస్టరీగా మారింది. ఈ ఎపిసోడ్‌పై డీజీపీ, సీఐడీ చీఫ్‌తో సహా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు డీఎస్పీలు, సీఐలతో కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు.ప్రభుత్వం మారిన వెంటనే ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గుంటూరులోని నగరం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద అరెస్టు చేసి వేధించారని ఆరోపించారాయన. మాజీ సీఎం జగన్‌తో పాటు అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌, మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని.. రబ్బర్‌ బెల్ట్‌, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురిచేయడం లాంటి అంశాలకు సంబంధించి వేర్వేరు సెక్షన్లు పెట్టారు. వీటిలో బెయిల్‌బుల్‌, నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్లు కూడా ఉన్నాయి. సిఐడి అధికారులపైనే కేసులు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. లోతైన విచారణ తరువాత ఈడీకి కూడా సిఫార్సు చేస్తామని.. అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. మద్యం అక్రమాలపై అసెంబ్లీలో ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. మద్యం ధరలు పెంచి వచ్చిన వేలాది కోట్ల రూపాయాల సొమ్మును వైసీపీ నేతలు దోచుకుతిన్నారని ఆరోపించారు. పేదవాడి బలహీనతను ఆసరగా చేసుకుని నాణ్యత లేని లోకల్‌ బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు. వాటిని విచ్చలవిడిగా విక్రయించి.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని మండిపడ్డారు.మద్యం అక్రమాలపై సీఐడి విచారణలో ఏం తేలనుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇదే అసెంబ్లీలోనే టీడీఆర్‌ బాండ్లపైనా చర్చ జరిగింది. రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకూ 3306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని.. దీనిపై శాఖాపరమైన చర్యలు, ఏసీబీ విచారణకు ఆదేశించామన్నారు మంత్రి నారాయణ. తణుకు పురపాలక సంఘంలో 61 బాండ్లు జారీ చేశారు. టీడీపీ హాయాంలో 6000 గజాలకు మాత్రమే బాండ్లు ఇచ్చారని గుర్తు చేశారు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. గతంలో సంవత్సర కాలంలోనే లక్ష, 48వేల 400 గజాలు వరకూ బాండ్లు ఇచ్చారన్నారు. జగనన్న కాలనీ పేరుతో 25 కోట్లకు బాండ్లు ఇష్యూ చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహరంలో సూత్రధారి ఎవరో తేల్చడంతో పాటు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు.టీడీఆర్‌ బాండ్లకు సంబంధించి నాలుగు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయన్నారు మంత్రి నారాయణ. ప్రస్తుతం ఇచ్చిన బాండ్లు కంప్లీట్‌గా రిలీజ్ చేయొద్దని.. రిపోర్టు రాగానే యాక్షన్ తీసుకుంటామన్నారు. ప్రభుత్వం మారి.. రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. అంతలోనే అవినీతిలో కూరుకుపోయిన అంశాలపై దృష్టి సారించింది. అందుకు బాధ్యులెవరో తేల్చే పనిలో పడింది. చంద్రబాబు సర్కార్‌ దూకుడుగా ముందుకెళ్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుంది.

Related Posts