ముంబై, జూలై 26,
మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గూడు చెదిరి కొందరు.. గుండె పగిలి మరికొందరు. బతుకుజీవుడా అంటూ.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో చెట్టుకు, పుట్టకు చేరిన దైన్యం…! ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. నిండు జీవితాలను చిదిమేస్తూ…. వరద బీభత్సం సృష్టించింది. ముంబై, పుణె నగరాల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మహారాష్ట్రలోని నాలుగు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే 24 గంటలకు భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం(IMD) హెచ్చరించింది. ముంబై, పుణె, రాయ్‌గఢ్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.ముంబైలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఈనేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమాన సమయాల్లో జాప్యానికి కారణమవుతోందని, విమానాశ్రయాలకు బయల్దేరేముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. స్పైస్‌జెట్ నుంచి కూడా ఇదేతరహా ప్రకటన వచ్చింది. అటు లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.