YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డేంజర్ లో దానం....

డేంజర్ లో దానం....

హైదరాబాద్, జూలై 26,
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ కూడా చేశారు. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మరో పార్టీ టికెట్ ఇవ్వడంపైనా అప్పుడు చర్చ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్‌ను కూడా కలిశారు. వీరితోపాటు బీజేపీ కూడా ఇదే డిమాండ్‌ను మరింత సీరియస్‌గా చేస్తున్నది. బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై అనర్హత వేటు వేయాలని ఆయన స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, తన ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదని, తన ఫిర్యాదును స్పీకర్ స్వీకరించేలా ఆదేశించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ధర్మాసనం ఈ రోజు కూడా ఈ పిటిషన్ పై వాదనలు విన్నది, తీర్పు కూడా ఇచ్చింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ స్వీకరించాలని, పిటిషనర్‌కు ధ్రువీకరణ రశీదు కూడా ఇవ్వాలని ఆదేశించింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు ఆ పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ కన్ను వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీ మారిన దానం నాగేందర్ పై వేటు పడితే.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మళ్లీ ఉప ఎన్నిక జరుగుతుందని, అప్పుడు బీజేపీ ఆ సీటును కైవసం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి. దానం నాగేందర్‌తోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపైనా ఈ రోజు విచారణ జరిగింది. అయితే, స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని ఏజీ తెలిపారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అని, స్పీకర్ నిర్ణయంలో కోర్టుల జోక్యం ఉండదని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందన్నారు. మూడు నెలలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని పేర్కొన్నారు. వివాదం కోర్టులో ఉన్నందున స్పీకర్.. పిటిషన్లను పరిశీలించలేదని, కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉండొచ్చని వివరించారు.

Related Posts