అమరావతి
వైకాపా లో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్బై చెబుతున్నారు. గత వారం రోజులుగా జిల్లా స్థాయి నాయకులు ఎందరో వైసీపీకి దూరమవుతున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాస్థాయిలో కీలక నేతలు పార్టీకి దూరమవుతున్నారు. పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత జగన్ దృష్టిపెట్టకపోవడం, కిందిస్థాయి క్యాడర్ను పట్టించుకోకపోవడంతోనే వైసీపీ నాయకులు పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సైతం నచ్చకపోవడంతోనే వైసీపీకి నేతలు గుడ్బై చెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇద్దరు కీలక నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. వాస్తవానికి చాలామంది నాయకులు వైసీపీని వదిలి ఇతర పార్టీల్లో చేరాలనే అభిప్రాయంతో ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి సిగ్నల్ వస్తే మాత్రం వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పార్టీ ఏలూరు జిల్లా కోశాధికారి, ఏలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంచెం మైబాబు కూడా రాజీనామా చేశారు. ఈ ఇద్దరు నేతలు గత కొంతకాలంగా వైసీపీలో కీలకంగా పనిచేశారు. ముఖ్యమైన ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో వీరితో పాటు వీళ్ల అనుచరులు సైతం వైసీపీకి దూరం కానున్నారు. మరికొందరు సీనియర్లు సైతం జిల్లాలో వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పార్టీ విధి, విధానాలు నచ్చకపోవడంతోనే శ్రీనివాస్, మైబాబు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల రాజీనామా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలు ఉండవచ్చు