అనంతపురం, జూలై 31,
జేసీ కుటుంబం అసంతృప్తిలో ఉందా? గెలిచినా తమను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని మధనపడిపోతున్నారా? గతఐదేళ్లు తాము అనుభవించిన కష్టాలకు గెలిచిన వెంటనే అందుకు సరైన చర్యలు తీసుకోవాలని సూచించినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోక పోవడానికి కారణాలపై ఆయన తన ముఖ్య అనుచరుల వద్ద వాపోతున్నారని తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా తనను అకారణంగా జైలుకు పంపించిన వారిపై చర్యలు ఎందుకు లేవని ఆయన నేతలను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత గత ఐదేళ్లు మానసిక క్షోభ అనుభవించడం పార్టీ పెద్దలకు తెలియదా? అంటూ నిలదీస్తున్నట్లు తెలిసింది. తాడిపత్రి అంటే జేసీ కుటుంబం అడ్డా. అలాంటిది తొలిసారి 2019 ఎన్నికల్లో జగన్ హవాలో ఓటమిపాలయ్యారు. పెద్దిరెడ్డి చేతిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయనపై తర్వాత అనేక కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను కొనుగోలు చేసి వాటిని బీఎస్ 6 గా మార్చి రిజిస్ట్రేషన్ లు చేయించారని ఆయన బస్సులను అప్పటి ప్రభుత్వం సీజ్ చేసింది. దీంతో పాటు ఐదేళ్లలో మొత్తం జేసీ ప్రభాకర్ రెడ్డిపై 72 కేసులు నమోదయ్యాయి. ఆయన కొన్నాళ్లపాటు జైలు శిక్ష కూడా అనుభవించి ఆ తర్వాత న్యాయస్థానంలో బెయిల్ పొంది బయటకు వచ్చారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాడు తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచి ఇంకా తన పట్టు పోలేదని ఆయన నిరూపించుకోగలిగారు. ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా జేసీ తో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై నమోదయిన కేసులపై విచారణ జరపాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒకరకంగా అల్టిమేటం ఇచ్చారు. డెడ్‌లైన్ కూడా పెట్టారు. కానీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం కదలిక రాకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత నిర్వేదంలో కూరుకుపోయినట్లు కనపడుతుంది. తమ కుటుంబానికి సరైన ప్రయారిటీ ఈ ప్రభుత్వంలో లభించడం లేదని ఆయన అనుచరుల వద్ద వాపోతున్నారని తెలిసింది. గత ఐదేళ్లలో తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాన్ని కూడా నాయకత్వం గుర్తించడం లేదని వాపోతున్నారటఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మను కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మర్యాదపూర్వకంగానే విజయమ్మను కలిశానని జేసీ చెబుతున్నప్పటికీ ఇందులో మర్మమేమిటన్న ప్రశ్న మాత్రం టీడీపీ నేతల్లో బయలుదేరింది. అనంతపురం జిల్లాలో తనకు ప్రయారిటీ లభించలేదని తెలిసి ఆయన అధినాయకత్వానికి ఝలక్ ఇవ్వడానికే విజయమ్మను కలిశారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. లేకపోతే విజయమ్మను కలవాల్సిన సమయం ఇదేనా అన్న ప్రశ్న కు మాత్రం సమాధానం దొరకడం లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఆయన బయటపడకపోయినప్పటికీ జేసీ కుటుంబంలో పార్టీ నాయకత్వం తమ పట్ల చూపుతున్న వైఖరికి మాత్రం నొచ్చుకున్నట్లే కనపడుతుందని చెబుతున్నారు.