విశాఖపట్టణం, జూలై 31,
గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన మండలాలకు తహసీల్డార్‌లుగా పని చేసి వందలు, వేల కోట్ల కుంభకోణాల ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొన్న తహసీల్దార్‌లనే కూటమి ఎమ్మెల్యేలు ఏరి కోరి ఎంచుకొన్నారు. నిజాయితీపరుల కంటే అవినీతిపరులు, పైరవీకారులకే పెద్ద పీట వేశారు. ఎన్నికల సమయంలో పక్క జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్‌లు తిరిగి రావడంతో జిల్లా కలెక్టర్ హరీందర ప్రసాద్ శనివారం వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. వీటిని చూసిన జనం, కూటమి కార్యకర్తలు ముక్కున వేలేసుకొంటున్నారు. విశాఖలో అత్యంత కీలకమైన వేల కోట్ల ప్రభుత్వ భూములు వున్న ఆనందపురం తహసీల్దార్ పోస్టు.. రెవిన్యూ విభాగంలో అత్యంత వివాదాస్పదుడిగా పేర్కొని, వందల కోట్ల భూకుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.శ్యాం ప్రసాద్‌కు దక్కింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెందుర్తిలో హైకోర్టు సైతం తప్పుపట్టిన ముదపాక ల్యాండ్ పూలింగ్ భూములతో పాటు అప్పటి ఎమ్మెల్యే అదీప్ రాజుకు వందల కోట్ల భూ వ్యవహారాలు చేసిపెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్‌గా బదిలీ అయిన ఆయన అక్కడ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహార్ రెడ్డి కూరుకుపోయిన ప్రీ హోల్డ్ భూ కుంభకోణంలో ఏపీఐఐసీ కి చెందిన భూములను ప్రైవేటు భూములుగా చూపించి సర్టిఫికేట్‌లు ఇచ్చేశారు. అలా ఇచ్చేసిన 70 ఎకరాలలో 20 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఉండటం గమనార్హం. ఈ కుంభకోణంలో క్రమ శిక్షణా చర్యలకు గురౌతారనుకొన్న శ్యాంకు రాష్ర్టంలోనే కీలకమైన మండలంగా భావించే ఆనందపురం దక్కడం సాటి రెవెన్యూ అధికారులను ఆశ్చర్చపరచింది.గత వైసీపీ పాలనలో విశాఖలో అత్యంత కీలకమైన ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల తహసిల్దార్‌గా పనిచేసి పలు ఆరోపణలు ఎదుర్కొన్న కె. వేణుగోపాల్‌కు ఈసారి ప్రాధాన్యత ఉన్న పెందుర్తి దక్కింది. గతంలో జగనన్న ఇళ్ల పట్టాల పథకం భూసేకరణలో తీవ్ర ఆరోపణలతో పాటు వందల కోట్ల విలువైన భూములను 22ఎ నుంచి తప్పించే సిఫార్సులు చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పెందుర్తి తహసిల్దార్‌గా పని చేసి ముదపాక భూముల వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహానికి గురైన ఎం ఆనందకుమార్‌కు పద్మనాభం పోస్టు ఇచ్చారు.రెవిన్యూలో ఖరీదైన తహసిల్దార్‌గా పేరుపడ్డ ఎల్.రామారావు వైసీపీ పాలనతో అత్యంత కీలకమైన పెందుర్తి, సబ్బవరం, ఆనందపురం మండలాల్లో పనిచేశారు. ఇప్పుడు ఆయనకు పారిశ్రామిక ప్రాంతాలు, ఏపీఐఐసీ భూములు, వక్ప్ భూములు ఉన్న పెద గంట్యాడ పోస్టు దక్కింది. గతంలో పెందుర్తి చేసిన పి.రామారావుకు ఇప్పుడు భీమిలి పోస్టు దక్కింది. విశాఖలో అత్యంత కీలకమైన వేల కోట్ల ప్రభుత్వ భూములు వున్న ఆనందపురం తహసీల్దార్ పోస్టు.. రెవిన్యూ విభాగంలో అత్యంత వివాదాస్పదుడిగా పేర్కొని, వందల కోట్ల భూకుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.శ్యాం ప్రసాద్‌కు దక్కింది.