YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అసంతృప్తా...గొంతెమ్మ కోరికలా

అసంతృప్తా...గొంతెమ్మ కోరికలా

మహబూబ్ నగర్, జూలై 31,
బీఆర్ఎస్ పార్టీ ఘర్‌వాపసీ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇస్తూ అందులో చేరిన తమ ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే గులాబీ గూటికి వస్తారని బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తాను బీర్ఎస్‌లోకి వచ్చినట్టు ప్రకటించగా.. మరో ఎమ్మెల్యే తాజాగా కేటీఆర్‌తో భేటీ అయ్యారు.భద్రాచల్లం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, బీఆర్ఎస్ ఘర్‌వాపసీ ఆపరేషన్ ప్రారంభించిందని, త్వరలోనే ఈ నలుగురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఇప్పటికే తాను బీఆర్ఎస్‌లో చేరినట్టు ప్రకటించారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రశాంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన మళ్లీ బీఆర్ఎస్‌లోకి తిరిగి రాబోతున్నట్టు తెలుస్తున్నది. వీరితోపాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కూడా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నారు.ఒకరి వెంట ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బాటపట్టడంతో గులాబీ పార్టీ ఆందోళనకు గురైంది. దీనికితోడు లోక్ సభ ఎన్నికల్లోనూ ఫలితాలు ఏమీ రాకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంటున్నది. ఈ నేపథ్యంలోనే గులాబీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఘర్ వాపసీకి తెరలేపి పార్టీలో మళ్లీ ఒక కొత్త స్థైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థం అవుతున్నది.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదులు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ వచ్చే నెల 1వ తేదీకి ఉన్నది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ టికెట్ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ప్రకటించిన తర్వాత తిరస్కరించారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టికెట్ పైనే కడియం కావ్య వరంగల్ ఎంపీగా గెలిచారు.ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్నిరోజులపాటు అలక పట్టడంతో ఢిల్లీ పెద్దలు బుజ్జగించాల్సి వచ్చింది.ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.అసెంబ్లీలో కేటీఆర్‌తో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈనెల 6న ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంతలోనే యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గత ఆరు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి..ఇక నుంచి బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. అయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమానికి హాజరు కాగా, అదే సమయంలో కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లడం గమనార్హం

Related Posts