కాలా విడుదలయ్యే సినిమా థియేటర్ల వద్ద భద్రతను పటిష్టం చేయాలని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వస్తున్న థియేటర్స్‌కు భద్రత అవసరమని కుమాస్వామికి రజినీకాంత్ కన్నడ భాషలో లేఖ రాశారు. భద్రత కల్పించాలన్న కోర్టు ఉత్తర్వులను ఆయన గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామన్న కుమారస్వామి... వ్యక్తిగతంగా మాత్రం తాను కాలా సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటకలో సినిమా విడుదలకు ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు.కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకోగలనని రజినీకాంత్ తన లేఖలో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అవుతున్నప్పుడు కర్ణాటకలో మాత్రం నిషేధం విధించడం సరికాదని అన్నారు. సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాలని కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌కు రజినీ విజ్ఞప్తి చేశారు. నిషేధానికి పిలుపు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అన్నారు. కర్ణాటకలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాల్సిందేనని శాసనసభ ఎన్నికల సమయంలో రజినీ అన్నారు. ఒకసారి కర్ణాటకకు వచ్చి నీటి నిల్వలను రజినీ చూస్తే బాగుంటుందని కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు. ఇంతలోనే కన్నడి సంఘాల హెచ్చరికలతో వాతావరణం వేడెక్కింది. కాలా సినిమాను విడుదల కానివ్వబోమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. రజినీ క్షమాపణ చెప్పినా ఊరకునేది లేదని తేల్చేశాయి. రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కాలా సినిమా రేపు విడుదలకానుంది. కర్ణాటకలో కాలా సినిమా నిలిపివేయడానికి వీలులేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాలాను నిషేధించాలని దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.