కాంగ్రెస్ పార్టీ మనకు ద్రోహం చేస్తే, బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని చంద్రబాబు అన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా బుధవారం నాడు కడప మునిసిపల్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ మనకు ద్రోహం చేసిందని, విభజన అనంతరం బీజేపీ మనకు నమ్మక ద్రోహం చేసిందని చంద్రబాబు అన్నారు. మనకు ద్రోహం చేసిన వారు అసూయ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు అన్నారు. మనకు అన్యాయం చేసిన వారికి గుణపాఠం చెప్పేలా నవనిర్మాణ దీక్ష చేపడదామన్నారు. విభజన చట్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్ మనకు రాకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ వద్ద విశ్వాసం ప్రకటిస్తారని, బయటకు వచ్చి అవిశ్వాసం అంటారని దుయ్యబట్టారు. విద్యాభివృద్ధిపై మనం దృష్టి పెట్టిన కారణంగానే ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్స్ ను జీరో శాతానికి తీసుకువచ్చామని, అలాగే మాధ్యమిక, ఉన్నత విద్యాలో కూడా డ్రాపౌట్స్ ను అతితక్కువ శాతానికి తీసుకువచ్చామని చంద్రబాబు చెప్పారు. ఐదుకోట్ల మంది ఒకే లక్ష్యంతో చేసే దీక్ష ఇదేనని చంద్రబాబు అన్నారు. లాలూచీ రాజకీయాలకు పాల్పడే వారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.
ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు. నీట్ పరీక్ష రాసి పాసైన విద్యార్థులకు ఇక్కడే అడ్మిషన్లు ఇస్తామని చెప్పారు. నీట్ రాయని ఫాతిమా కాలేజి విద్యార్థులకు కూడా వారి డబ్బులు వెనక్కు ఇప్పిస్తామని చంద్రబాబు చెప్పారు.