విశాఖపట్టణం, ఆగస్టు 2
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండు నెలల్లోనే వైసీపీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతోంది. అదే విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక. జనసేనలో చేరడంతో ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ మీద అనర్హతా వేటు వేశారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన జరుగుతుంది. విశాఖ స్థానిక సంస్థల ఓటర్లలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 ఓట్లు ఉండగా, అధికార పార్టీ టీడీపీకి కేవలం 215 మాత్రమే ఉన్నాయి. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. సంఖ్యాపరంగా చూస్తే వైసీపీ గెలుపు సునాయాసం. ఇతర పార్టీలు పోటీలో నిబలడేందుకు కూడా ఆసక్తి చూపవు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ గెలుపుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతోదంి. విశాఖలో పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు కొంతమంది ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జడ్పీటీసీలు టీడీపీ గూటికి చేరారు. కానీ మెజార్టీ ఓటర్లు పార్టీలోనే ఉన్నారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కార్పొరేటర్లను ముందస్తుగా క్యాంపులకు తరలిస్తున్నారు. ఇంకా నెల రోజుల వరకూ ఓటింగ్ కు సమయం ఉన్నా.. ముందు జాగ్రత్తగా ఎంత ఖర్చు అయినా భరించి ఓటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి అభ్యర్థి కూడా కీలకమే. ముఖ్యంగా ఓటర్లను సంతృప్తి పరిచేలా అర్థిక సామర్థ్యం ఉన్న నేత అవసరం. వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ పేరు వినిపించింది. అయితే తాను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆర్థికంగా చితికిపోయి ఉన్నానని ఆయన వెనుకడుగు వేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి కాస్త బలమైన నేపధ్యం ఉన్న నేతలు ముందుకు రావడం కష్టమే. అయినా వైసీపీ హైకమాండ్ సరైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇక కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా ప్రచారంలోకి రాలేదు. జనసేన పార్టీకి కేటాయిస్తారా లేకపోతే సీట్ల కేటాయింపులో అవకాశం దక్కని టీడీపీకి చెందిన సీనియర్ నేతలకు చాన్సిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మహబూబ్ నగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉపఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ ఉపఎన్నిక వచ్చింది. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా బీఆర్ఎస్ తన ఓటర్లను కాపాడుకుని .. ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే స్ఫూర్తితో గెలవాలని వైసీపీ అనుకుంటోంది. ముందుగానే ఓటర్లను క్యాంపులకు తరలిస్తోంది.